– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-31 వ డివిజన్ 206 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31 వ డివిజన్ 206 వార్డు సచివాలయ పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. పసుపుతోటలో విస్తృతంగా పర్యటించి 280 గడపలను సందర్శించారు. ప్రజలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడుగడుగునా ప్రజలు కనబరుస్తున్న అభిమానం, ఆప్యాయతలను చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 నెలల పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ప్రభుత్వ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని సంతోషంగా చెబుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. అలాగే ఒక సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం ముగించుకున్న వెనువెంటనే అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేసుకుని.. మరో సచివాలయానికి వెళ్లే లోపు పనులు ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజలకు క్షమాపణ చెప్పి బాబు, పవన్ పర్యటనలు చేయాలి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషించడమే ఏకైక అజెండాగా.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని అర్థరహితంగా విమర్శించడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు కనీసం ప్రజల ముఖం చూడని గత పాలకులు.. మరలా ఏముఖం పెట్టుకుని పర్యటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన ప్రజలకు మేలు చేసుంటే.. టీడీపీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అయిందో..? పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఘోర పరాజయం పాలయ్యారో..? జనసేన అధినేత సమాధానం చెప్పాలన్నారు. పైగా నేనంటే నేను ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తమ మద్ధతు అని ప్రజలందరూ ఘంటాపథంగా చెబుతున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అధికారంలో ఉండగా దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. కానీ తొలి కేబినెట్ లో దళిత మహిళకు హోమ్ మంత్రిగా స్థానం కల్పించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అది చూసి ఓర్వలేక కోనసీమ జిల్లాలో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు అధికారంలో ఉండగా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు.. బస్సు ఎక్కి చేస్తున్న కొత్త డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు మానం వెంకటేశ్వరరావు, మురళీ కృష్ణంరాజు, బెజ్జం రవి, అంగిరేకుల విజయ్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News