గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భరోసా లభిస్తుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నుండి నగరంలో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ల ఏర్పాటు పై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, నగరపాలక సంస్థ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష చేపట్టిందని, ఈ నెల 30 నుండి నవంబర్ 15 వరకు ప్రత్యేకంగా నిపుణులైన వైద్యులతో మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నగరంలోని 29 వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద క్యాంప్ లు జరుగుతాయని, అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఎస్.ఈ.ని, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని, సమన్వయం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి సెంటర్ లో రోజుకి 15 వందల మందికి వైద్య పరీక్షలు చేసేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని, ప్రతి సచివాలయ కార్యదర్శి క్యాంప్ లో భాగస్వాములు అయ్యేలా చూడాలని నోడల్ అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి పరీక్షల నివేదిక, అవసరమైన మందులతో కిట్ ని అందిచాలన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ 45 రోజుల పాటు జగనన్న సురక్ష క్యాంప్ లు జరుగుతాయని, ఇప్పటికే ఏఎన్ఎం, ఆశా, వాలంటీర్లు ఇళ్ళ వద్దకు వచ్చి ఆరోగ్య సర్వే చేశారని, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంబందిత అర్బన్ హెల్త్ సెంటర్ లోని క్యాంప్ కి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి శిబిరంలో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ తో పాటుగా ఇద్దరు ఎంబిబిఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకొని, అవసరమైతే అందుబాటులోని హాస్పిటల్ ల్లో చేర్చి చికిత్స అందిస్తారని, ఆరోగ్య శ్రీ ద్వారా కూడా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ జయ రామకృష్ణ, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, సూపరిండెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News