– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్రస్థాయిలో పరిశీలనలు, చర్యలు లేకుండా విత్తన, సాగునీరు, ఎరువుల ప్రణాళికలు సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సాగునీరు అందించేందుకు తగు నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని, రైతుల అవసరాల మేరకు కనీసం 90% సబ్సిడీతోనైనా అన్ని రకాల పంటలకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఎరువుల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ-క్రాప్‌తో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ సాగుదారులందరికి ఎరువుల అందించాలని, పెరిగిన ఎరువులు ధరలను నియంత్రించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రణాళికలో 87 లక్షల ఎకరాల్లో పంటల పండించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో వరి 39 లక్షలు, వేరుశనగ 14 లక్షల ఎకరాలు, పత్తి 6 లక్షల ఎకరాలు, అపరాలు 9.5% లక్షల ఎకరాలు తదితర పంటలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో మారిన పరిస్థితులలో రైతులు ఎవరూ సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే పరిస్థితులు లేవు. అంతా మార్కెట్ మీదే ఆధారపడి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అన్ని పంటలకు అవసరమైన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పండించే ఆహార పంట వరి. 39 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను 1.6 లక్షల క్వింటాలు వరి విత్తనం అందించాలని నిర్ణయించారు. ఎకరానికి 30 కేజీలు చొప్పున 1.17 కోట్ల క్వింటాళ్లు అవసరమవుతుంది. కాని ప్రభుత్వం ఇస్తున్నది 1.60 లక్షల క్వింటాళ్లు మాత్రమే అంటే కేవలం ప్రభుత్వ వాటా 1.37% అంటే, ప్రతి 100 క్వింటాళ్ల విత్తన అవసరానికి ప్రభుత్వం సుమారుగా 1.4 క్వింటాళ్లు మాత్రమే అందిస్తోంది. ఒకవేళ 20 శాతం మంది రైతులు సొంతంగా విత్తనాలపై ఆధారపడినా మిగిలిన 68.63% విత్తనాలను బయట మార్కెట్ నుండి సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా పండించే పంట వేరుశనగ. ఆ వేరుశనగ పంటకు విత్తన సరఫరాలో రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏడాది కోత పెడుతూనే ఉంది. 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ పండించడానికి ఎకరానికి 75 కేజీల చొప్పున 10 లక్షల 50 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ కాయలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో ఇస్తామని చెబుతున్నది. కాని కేవలం 2.20 లక్షలు క్వింటాలు మాత్రమే ఇస్తున్నది. మొత్తం అవసరంలో ప్రభుత్వం కేవలం 21శాతం మాత్రమే ఇస్తుండగా, మిగిలిన 79 శాతం మేర విత్తనాల కొరత ఉంటుంది. ప్రతి అయిదుగురిలో ఒక్కరికి మాత్రమే విత్తన సబ్సిడీ అందుతున్నది. మిగిలిన రైతులు ప్రైవేట్ విత్తన వ్యాపారులపై ఆధారపడవలసి వస్తున్నది. కనీసం వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ విత్తన కాయలను పూర్తి సబ్సిడీతో ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పత్తి, మిర్చి విత్తనాలు ప్రభుత్వం అందించదు. బయట మార్కెట్‌లో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. వాటిని నియంత్రించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
ఇటీవల ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. యూరియా డీఏపీల ధరలు ప్రస్తుతం పెరగలేదు.పెరిగిన కాంప్లెక్స్ ఎరువులలో అత్యధిక 16-20-0-13 గ్రేడ్ ఎరువుపై ఏకంగా 25% ధర పెరిగింది. అన్ని రకాల ఎరువులకు సగటున చూస్తే, బస్తాకు రూ. 200 నుండి రూ. 375 వరకు అదనపు భారం పడుతోంది. పెరిగిన ఎరువులను నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఎరువులు కొనుగోలు చేసే రైతులపై నిఘా ఉంచాలని ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచన దుర్మార్గం. పైగా గత సంవత్సరం ఈ-క్రాప్ బుకింగ్ నమోదు ఆధారంగా ఎరువులు ఇస్తామని ఆంక్షలు పెట్టడం అన్యాయం. కౌలు రైతుల పేర్లు ఈ క్రాప్ బుకింగ్‌లో నమోదు కాలేదు. అసైన్మెంట్ భూములు సాగుచేసే రైతుల పేర్లు కూడా ఆన్లైన్‌లో రికార్డులు కాలేదు. నదీ పరివాహక ప్రాంతాలలో భూములు సాగు చేసేవారి పరిస్థితి అంతే. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవ సాగుదారులకు ఎరువులు అందే అవకాశం లేదు.
రాష్ట్రంలోనే ప్రధాన, మధ్య, తరహా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, జలాశయాల్లో నిల్వలు, కాలవల మరమ్మతులు తదితర అంశాలను పరిగణనలో ఉంచుకొని మరియు ఖరీఫ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మే 15 నాటికి నీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. మే రెండో తేదీ నుండి కాలవలు నిర్వహణ పనులు ప్రారంభించామని చెప్తున్నారు. అలాంటప్పుడు మే 15వ తేదీ నాటికి నారుమళ్లు పోసుకోవడానికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు సక్రమంగా పారుదల అయ్యే అవకాశం లేదు. చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మి నారుమళ్లు పోసుకుంటే రైతుల పెట్టుబడి వృధా అవుతుంది. కాలవలను పనులు పూర్తి చేయకుండానే నీరు చేరితే కాంట్రాక్టర్లు పనులు చేశామని బిల్లు చేసుకుని ప్రభుత్వ నిధులు కాజేసేందుకు అవకాశం ఉంది. చెరువులు ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. వందలాది ఎత్తిపోతల పథకాలు పని చేయడం లేదు. పంట కాలవలు, డ్రైనేజీలలో గుర్రపు డెక్క, తూడు కాడ, పూడిక పెరిగిపోయి ముళ్ళ కంపతో అడవి తలపించే విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసి సకాలంలో నీరిచ్చే చిత్తశుద్ధి లేదనిపిస్తున్నది. ప్రసారమాద్యాల్లో ఉన్న శ్రద్ధ సాగునీరు అందించే విషయంలో లేదని స్పష్టమవుతుంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద సాగునీరు అందించడానికి అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలి. రైతుల అవసరాల మేరకు కనీసం 90% సబ్సిడీతోనైనా అన్ని రకాల పంటలకు నాణ్యమైన విత్తనాలు అందించాలి. ఎరువుల అక్రమార్కులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలి. ఈ-క్రాప్‌తో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవ సాగుదారులందరికి ఎరువుల అందించాలి. పెరిగిన ఎరువులు ధరలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
Prajavartha Online Telugu News