-గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం
-గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, నృత్య రీతులను పరిరక్షించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ తెలిపారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం-2026 లో భాగంగా రెండో రోజు ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, కళారూపాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక విద్యను అభ్యసించడం ద్వారా గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజన కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
థింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంలో గిరిజన సంక్షేమ శాఖ చేసిన కృషిని ఆయన అభినందించారు. మిగిలిన గిరిజన నృత్యాలు, కళారూపాలు, కళాకారులకు కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థ ద్వారా రాష్ట్రంలోని గిరిజన కళాకారుల పూర్తి వివరాలతో కూడిన డేటాబేస్ రూపొందించడంతో పాటు, వారి సంప్రదాయ సంగీత వాయిద్యాలను సేకరించి భద్రపరుస్తామని తెలిపారు.
వర్ధమాన కళాకారులు, శిక్షకులకు అవసరమైన శిక్షణ అందించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన సాంస్కృతిక విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెప్పారు. కూచిపూడి, భరతనాట్యం వంటి సంప్రదాయ కళలకు లభిస్తున్న ప్రాధాన్యతతో సమానంగా గిరిజన నృత్య రీతులకు కూడా గుర్తింపు, ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
గిరిజన సంస్కృతి, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు
గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ మిషన్ డైరెక్టర్ డా. మందారాణి స్వాగత ఉపన్యాసం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ కోసం గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ రీసెర్చ్ మిషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2024లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిధులతో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (మైసూర్) భాగస్వామ్యంతో ఆరు గిరిజన భాషల్లో ప్రైమర్లు, నిఘంటువులను ఈ-మాడ్యూల్స్ రూపంలో రూపొందిస్తున్నామని తెలిపారు.
సికిల్ సెల్ వ్యాధిపై గిరిజన భాషల్లో అవగాహన మాడ్యూల్స్ రూపొందించి ఐటీడీఏలకు అందించామని చెప్పారు. పీఎం-జన్మన్ పథకం కింద మౌలిక వసతులపై అధ్యయనానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. టెర్రకోట, క్లే మోడలింగ్, వెదురు ఉత్పత్తులు, పూసల తయారీ తదితర రంగాల్లో గిరిజనులకు ఉపాధి శిక్షణలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో జాతీయ ఖేల్ మహోత్సవ్ నిర్వహించడంతో పాటు భోగాపురం వద్ద భారీ స్థాయిలో నిర్వహించిన ధింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించిందని గుర్తుచేశారు.
గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే బలమైన ఆయుధం
గురుకులాల కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతి, కళలు వారి జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్నాయని అన్నారు. వారి ఉజ్వల భవిష్యత్తుకు విద్యే అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. గురుకులాల ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే గురుకులాల్లో అడ్మిషన్లు 10 శాతం పెరిగాయని, వచ్చే ఏడాది వాటిని 25 శాతానికి పైగా పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
విద్యార్థుల ఉన్నత చదువులకు అవసరమైన శిక్షణ అందించేందుకు ఐఐటీ మద్రాస్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. విద్యతో పాటు హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, పారిశుధ్య కార్మికుల నియామకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
గిరిజన కళలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గొప్ప పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024లో విజయవాడలో, 2025లో పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంలో, ధింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ప్రోత్సాహం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ధింసా, కొమ్ముకోయ, సవర ఆర్ట్, చెంచు చెంచాట, తప్పెటగుళ్లు, లంబాడీ తదితర గిరిజన కళారూపాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని సుమారు 27 లక్షల మంది గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గిరిజనుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన కళాకారుల సమగ్ర డేటాను రూపొందించి, ట్రైబల్ రీసెర్చ్ మిషన్ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. యోగా తరహాలో గిరిజన నృత్యాలను కూడా పాఠశాల విద్యలో ఒక భాగంగా చేర్చి భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
13,500 మంది విద్యార్థులు, 1,300 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొని సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు గిరిజనుల్లోని సహజ ప్రతిభకు నిదర్శనమని ఆమె ప్రశంసించారు. యానాది, నక్కల, చెంచు వంటి ప్రత్యేక గిరిజన తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
తుమ్మల పల్లి కళా క్షేత్రంలో గిరిజన సాంప్రదాయ నృత్య వేడుకలు మరియు చిత్రకళ ప్రదర్సన:
1. ఐ.టి.డి.ఏ, సీతంపేట జానపద కళాకారుల థాంగ్సెంగ్ (సవర నృత్యం)
● థాంగ్సెంగ్ (సవర నృత్యం) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ప్రాంతంలో నివసిస్తున్న సవర తెగ (పి.వి.టి.జి) యొక్క అందమైన నృత్యం.
● థాంగ్సెంగ్ అంటే సోరాలో “రింగ్ రాంగ్ జింగ్” అంటే నృత్యం చేసేటప్పుడు ఆందెలు/చీలమండల యొక్క జింగ్లింగ్ శబ్దం అని అర్థం.
● 20 మంది సవర గిరిజన కళాకారులు ప్రధర్సన ఇచ్చారు.
2. ఐ.టి.డి.ఏ, పార్వతీపురం జానపద కళాకారుల కంది కొత్తలు పండుగ నృత్యం
● కంది కొత్తలు (కంది అంటే ఎర్ర కంది పప్పు మరియు కొత్తలు అంటే కొత్త పంట) పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐటిడిఎ-పార్వతీపురం ప్రాంతంలోని సవర, జాతపు, కొండ దొర మరియు గదబ తెగలలో ఒక ముఖ్యమైన పండుగ, ఇది వారి సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
● యువత కొత్త దుస్తులు ధరించి “గొడ్డలమ” పండుగతో ప్రఖ్యాత సామాజిక నృత్యం ధింసాను ప్రదర్శిస్తారు.
● 21 మంది జాతపు గిరిజన కళాకారులు ప్రధర్సన ఇచ్చారు.
3. ఐ.టి.డి.ఏ, శ్రీశైలం జానపద కళాకారుల చెంచాట నృత్యం
● తూర్పు కనుమలలోని నల్లమల అడవిలో నివసించే చెంచు (పి.వి.టి.జి) ఈ అందమైన చెంచు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. చెంచులకు తెలిసిన ఏకైక నృత్యాన్ని చెంచాట అని పిలుస్తారు, ఇందులో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఒకరినొకరు ఎదురుగా నిలబడి డప్పు వాయిద్యానికి అనుగుణం నృత్యం చేస్తారు.
● 21 మంది చెంచు గిరిజన కళాకారులు ప్రధర్సన ఇచ్చారు.
4. ఐ.టి.డి.ఏ, K.R. పురం జానపద కళాకారుల కొమ్ము కోయ నృత్యం
● అల్లూరి సీతారామరాజు (ఏ.ఎస్.ఆర్), ఏలూరు జిల్లాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కోయ తెగ ప్రదర్శించే కొమ్ము కోయ నృత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన నృత్యాలలో అత్యంత అందమైన నృత్యాలలో ఒకటి. నృత్య వైవిధ్యాలు గిరిజన సమాజం యొక్క ఐక్యతకు ప్రతీక.
● వారు వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు. వారి సామాజిక పరిసరాల్లో వేగంగా మార్పులు వచ్చినప్పటికీ, గిరిజనులు తమ సంప్రదాయాలను, హస్తకళను విడనాడలేదన్నది నిర్వివాదాంశం.
● 21 మంది కోయ గిరిజన కళాకారులు ప్రధర్సన ఇచ్చారు.
5. APTWRS Girls (Students), Chittor District
● ధిమి ధిమి నాచ్ (Dhimi Dhimi Nach) అనేది బంజారా (లంబాడీ) సాంస్కృతిక నేపథ్యం కలిగిన అత్యంత ప్రజాదరణ పొందిన జానపద మరియు పండుగ పాట. ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ జరుపుకునే తీజ్ (Teez) పండుగ వేడుకలు, వివాహాలు మరియు వివిధ శుభకార్యాల్లో ఈ పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపిస్తూ నృత్యం చేస్తారు. బంజారా సాంప్రదాయంలో “తీజ్” అనేది కన్యకామణులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంలో బాలికలు మరియు మహిళలు కలసికట్టుగా ఆడుతూ పాడుకోవడానికి ఈ పాటను విస్తృతంగా ఉపయోగిస్తారు.
● 10 మంది లంబాడ గిరిజన విద్యార్దులు ప్రధర్సన ఇచ్చారు.
6. APTWRS Girls (Students), Rayachoti, Annamayya District
● సాంగ్: ధిమి ధిమి నాచ్ (Dhimi Dhimi Nach)
● ధిమి ధిమి నాచ్ (Dhimi Dhimi Nach) అనేది బంజారా (లంబాడీ) సాంస్కృతిక నేపథ్యం కలిగిన అత్యంత ప్రజాదరణ పొందిన జానపద మరియు పండుగ పాట. ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ జరుపుకునే తీజ్ (Teez) పండుగ వేడుకలు, వివాహాలు మరియు వివిధ శుభకార్యాల్లో ఈ పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపిస్తూ నృత్యం చేస్తారు.
7. GTWAGHS Girls (Students), Irlapalli, ITDA RC Varam, Alluri Sitarama Raju District
● సాంగ్: వింధ్య కా నారి
● వింధ్య కా నారి, వింధ్య కా నారి నృత్యం ద్వారా బాలికల ప్రతిబ మరియు వారి విలువ ను తెలియజేస్తారు.
● 10 మంది కోయ మరియు కొండరెడ్డి గిరిజన విద్యార్దులు ప్రధర్సన ఇచ్చారు.
8. Girls (Students), ITDA Nellore,
● 18 మంది యానాది మరియు ఎరుకల గిరిజన విద్యార్దులు కోలాటం నృత్యం ప్రధర్సన ఇచ్చారు.
9. ఐ.టి.డి.ఏ, పాడేరు జానపద కళాకారుల ధింసా నృత్యం (టీం 1)
● ధింసా అనేది మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలోని అరకు లోయ, ఇంకా చుట్టుపక్కల మన్యం/ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎంతో సంబరంగా చేసుకునే అచ్చమైన జానపద నృత్యం ప్రసిద్ధమైనది.
● ఆదివాసీ మహిళలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, లేదా భుజాల మీద చేతులేసి కాలికి కాలు కదుపుతూ వలయాకారంలో సంగీతానికి లయబద్దంగా నర్తిస్తారు.
● 21 మంది వాల్మీకులు, బగతలు, కమ్మర, కొండ దొరలు గిరిజన కళాకారులు ప్రధర్సన ఇచ్చారు.
10. ఐ.టి.డి.ఏ, పాడేరు జానపద కళాకారుల ధింసా నృత్యం (టీం 2)
● ధింసా నృత్యం ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలో అరకు లోయ, ఇంకా చుట్టుపక్కల మన్యం/ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎంతో సంబరంగా చేసుకునే అచ్చమైన జానపద నృత్యంగా ప్రసిద్ధమైనది.
● ఆదివాసీ మహిళలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, లేదా భుజాల మీద చేతులేసి కాలికి కాలు కదుపుతూ వలయాకారంలో సంగీతానికి లయబద్దంగా నర్తిస్తారు.
● 22 మంది బగతలు మరియు కొండ దొరలు గిరిజన కళాకారులు ప్రధర్సన ఇస్తారు.
కార్యక్రమంలో టీఏసీ సభ్యులు రావుల కొండలు, ఎస్టీ సెల్ నాయకులు ధారూ నాయక్, ట్రైకార్ ఎండీ మణికుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ట్రైబల్ రీసెర్చ్ మిషన్ అధికారులు, గిరిజన కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్
Prajavartha Online Telugu News