Breaking News

ఏఐ ఆధారిత పన్నుల నిర్వ‌హ‌ణ విధానంలో అగ్ర‌గామిగా ఏపీ

-ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాన్ని అభినందించిన జీఎస్టీ కౌన్సిల్ స‌భ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌న్నుల నిర్వ‌హ‌ణ విధానంలో కృత్రిమ మేథ‌స్సు, డేటా ఆధారిత విశ్లేష‌ణ‌ల‌ను వినియోగించుకోవ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌గామిగా ఎదుగుతూ మిగ‌లిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తోంది. ప‌న్నుల నిర్వ‌హ‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సును ఉప‌యోగించుకుంటున్న తీరును అధ్య‌య‌నం చేయ‌డానికి జీఎస్టీ కౌన్సిల్ స‌భ్యులు ప్ర‌త్యేకంగా రాష్ట్రానికి వ‌చ్చారు. జీఎస్టీ కౌన్సిల్ సెక్ర‌ట‌రియేట్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి పంక‌జ్ కుమార్సింగ్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి డి.పి. మిశ్రాల‌తో కూడిన బృందం సోమ‌వారం రాష్ట్ర వాణిజ్య‌ప‌న్నుల శాఖ కార్యాల‌యాన్ని సంద‌ర్శించింది. ప‌న్నుల నిర్వ‌హ‌ణ‌లో ఏఐ అమ‌లు చేస్తున్న తీరును స్వ‌యంగా ప‌రిశీలించి అధ్య‌య‌నం చేసింది. ఈ బృందాన్ని రాష్ట్ర వాణిజ్య‌పన్నుల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ బాబు ఏ, అధికారులు స్వాగతం ప‌లికారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌న్నుల నిర్వ‌ణ‌లో ఏఐ వినియోగిస్తున్న తీరుపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా జీఎస్టీ కౌన్సిల్ అధికారుల‌కు వివ‌రించారు. రిజిస్ట్రేష‌న్లు, రిట‌ర్నులు, ఆదాయ‌ప‌న్ను, వృత్తిప‌న్ను, పన్నుల బ‌కాయియిలు, ఆడిట్లు, త‌నిఖీలు, ప‌రిశీల‌న వంటి విభాగాల్లో ఐఏ ఆధారిత డ్యాష్ బోర్డుల‌ను వాణిజ్య ప‌న్నుల శాఖ అధికారులు ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌ధానంగా రాబ‌డికి సంబంధించి డ్యాష్ బోర్డు, ఈ-వే బిల్ డ్యాష్ బోర్డులు జీఎస్టీ కౌన్సిల్ అధికారుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ-వే బిల్ డేటా ఆధారంగా ఎస్‌జీఎస్టీ న‌గ‌దు చెల్లింపులు, ఐజీఎస్టీ సెటిల్మెంటును అంచ‌నా వేసేందుకు ఈ -వేబిల్ డ్యాష్ బోర్డు ఉప‌యోగ‌డ‌పుతుంద‌ని, త‌ద్వారా ఆదాయ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కీల‌క స‌మాచారం ల‌భిస్తుంద‌ని అధికారులు వివ‌రించారు.

స్థూల రాష్ట్ర దేశీయోత్ప‌త్తికి జీఎస్‌డీపీకి ప్ర‌ధాన సూచిక‌గా జీఎస్టీ డేటాను వినియోగిస్తున్న విధానం, త‌క్ష‌ణ అంచ‌నాల కోసం అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తిని కూడా అధికారులు వివ‌రించారు. రాష్ట్ర వాణిజ్య ప‌న్నుల శాఖ ప్ర‌త్యేకించి ఏఐ ఏజెంటు ద్వారా నివేదిక‌లు, డ్యాష్ బోర్డులు రూపొందిస్తున్న తీరును జీఎస్టీ కౌన్సిల్ బృందానికి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌ద‌ర్శించి చూపించారు. ఏఐ వినియోగించి వివిధ రంగాల‌కు సంబంధించి అధ్య‌య‌నాలు, స‌మాచారంతో ఒక నాలెడ్జ్ హ‌బ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామ‌ని వాణిజ్య ప‌న్నుల శాఖ ప్ర‌ధాన క‌మీష‌న్ బాబు ఏ వివ‌రించారు.

గ‌తంలోలా కాకుండా ప‌న్నులకు సంబంధించి ఆడిట్‌, కేసుల ఎంపిక‌, అవ‌క‌త‌వ‌క‌ల గుర్తింపు ప్ర‌క్ర‌య నుంచి నోటీసుల జారీ, ప‌న్ను చెల్లింపుదారుల స్పంద‌న‌ల ప‌రిశీల‌న‌, వాటిపై తుదినిర్ణ‌యం వ‌ర‌కు మొత్తం ప్ర‌క్రియ‌ను ఏఐ నిర్వ‌హించేలా చేస్తున్నామ‌ని చెప్పారు. దీనికి సంబంధించి రిట‌ర్న్స్ ప‌రిశీల‌న‌, ఆడిట్‌, త‌నిఖీ ప్ర‌క్రియ‌ల‌ను ప్ర‌తినిధి బృందం ప్ర‌త్య‌క్షంగా తిల‌కించింది. ప‌న్నుల నిర్వ‌హ‌ణ విధానాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థ‌ల ఏఐ ఇంజిన్ల‌ను వాణిజ్య ప‌న్నుల శాఖ వినియోగించుకుంటోంద‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆన్‌లైన్ లీగ‌ల్ కేస్ మేనేజ్మెంట్ సిస్ట‌మ్‌తో అనుసంధాన‌మై ప‌నిచేసే లీగ‌ల్ ఏఐ మాడ్యూల్ ను కూడా జీఎస్టీ కౌన్సిల్ స‌భ్యులు తిల‌కించారు. దీనిద్వారా వాణిజ్య ప‌న్నుల శాఖ‌కు సంబంధించిన కేసుల‌ను గుర్తించ‌డం, ప్ర‌భుత్వ న్యాయ‌వాదుల‌కు అవ‌స‌ర‌మైన సూచ‌న‌ల త‌యారీలో స‌హ‌క‌రించ‌డం, అప్పీళ్ల అధికారులు, జీఎస్టీఏటీ, హైకోర్టు, సుప్రీం కోర్టు ముందున్న కేసుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం వంటి ప‌నుల నిర్వ‌హ‌ణ‌కు ఈ మాడ్యూల్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులు వివ‌రించారు.

ఆద‌ర్శ‌ప్రాయంగా ఉన్నాయి: జీఎస్టీ కౌన్సిల్ స‌భ్యులు

ప్ర‌భుత్వ ప‌న్నుల నిర్వ‌హ‌ణ విధానంలో ఏఐ, డేటా విశ్లేష‌ణ లాంటి సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని రాష్ట్ర రాబ‌డి పెంచుకునే దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చూపిస్తున్న చొర‌వ‌, కృషి మిగిలిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా ఉంద‌ని జీఎస్టీ కౌన్సిల్ సెక్ర‌ట‌రియేట్ అధ‌న‌పు కార్య‌ద‌ర్శి పంక‌జ్ కుమార్ సింగ్ అన్నారు. దీనిద్వారా పన్నుల రాబ‌డి, ప‌న్నుల నిర్వ‌హ‌ణ విధానాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఏపీ రాష్ట్ర వాణిజ్య‌ప‌న్నుల శాఖ ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తోంద‌ని కొనియాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *