Breaking News

గంజాయి రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా

-గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం
-గంజాయి సమాచారం అందిస్తే బహుమతి – వివరాలు పూర్తిగా గోప్యం
-ఈగల్ ఛాలెంజ్‌లో భాగంగా 1972కు సమాచారం అందించండి
-విజయవాడ అంటే ‘బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్’ అనే నానుడికి స్వస్తి పలకాలని హితువు
-గంజాయి సేవించారనే నిర్ధారణ లేకుండా ఎలాంటి సంఘటనలనూ గంజాయితో ముడిపెట్టవద్దు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో నిరంతరాయంగా కృషి చేసి గణనీయమైన ఫలితాలను సాధించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఎన్‌కార్డ్, నషా ముక్త్ భారత్ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, డీసీపీ అడ్మిన్ కె.వి.జి.సరిత, ఈగల్ అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వి.కామరాజు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

విజయవాడకు సంబంధించి ‘గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్’ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ‘డ్రగ్స్‌పై దండయాత్ర 1.1’, ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ వంటి కార్యక్రమాలను చేపట్టి జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఎవరికైనా గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. గంజాయి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కలెక్టర్, పోలీస్ కమిషనర్ తెలిపారు. సమాచారం వాస్తవమని నిర్ధారణ అయితే నిబంధనల మేరకు తగిన బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
‘ఈగల్ ఛాలెంజ్’లో భాగంగా 1972కు సమాచారం అందించి బహుమతి పొందవచ్చు అని వారు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు. ప్రమాదాలకు కారణమైన వారు, కొట్లాటలకు దిగిన వారు గంజాయి సేవించారనే ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో సంఘటనలకు కారణమైన వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తిస్తున్నామని, కేవలం అనుమానం ఆధారంగా ప్రతి సంఘటనను గంజాయి వినియోగంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఏదైనా సంఘటనలో గంజాయి సేవించారా లేదా అనే విషయాన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ధారించిన తరువాత మాత్రమే దానిపై మాట్లాడాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి నియంత్రణకు సంబంధించి 100 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేస్తున్న గంజాయి నిరోధక విధానాలను ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కూడా మోడల్‌గా తీసుకుని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గతంలో గంజాయి సాగు జరుగుతున్న సుమారు 9 వేల ఎకరాలను ప్రభుత్వం పూర్తిగా నియంత్రించిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. గంజాయి సాగును గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రోన్లను విస్తృతంగా వినియోగించినట్లు వివరించారు. ప్రస్తుతం ఒక్క ఎకరంలో కూడా గంజాయి సాగు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండు విడతల్లో నిర్వహించిన గంజాయి నిరోధక కార్యక్రమాల్లో భాగంగా 1,287 మందిని పాజిటివ్ కేసులుగా గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మూడు నెలల అనంతరం వారిలో 840 మందికి తిరిగి పరీక్షలు నిర్వహించగా, 559 మందికి సంబంధించిన రిపోర్టులు అందినట్లు వివరించారు. గతంలో ఎక్కువ మోతాదులో గంజాయి సేవించిన వారి శరీరంలో దాని ఆనవాళ్లు పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో ఆరు నెలల వరకు కూడా పట్టవచ్చని తెలిపారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా కుటుంబాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో మరింత అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధక ప్రచారంలో భాగంగా మూడో విడతగా ‘ఈగల్ 1972’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అధికారులకు చేరవేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుని అది వాస్తవమని తేలితే తగిన బహుమతి అందజేస్తామని తెలిపారు.

సమావేశంలో ‘ఈగల్ 1972’ కార్యక్రమానికి సంబంధించిన ప్రదర్శనతో పాటు, ‘సే నో టు డ్రగ్స్’ గోడపత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు సంయుక్తంగా ఆవిష్కరించారు.

సమావేశానికి హాజరైన అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా సమాజంలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డీసీపీ అడ్మిన్ కె.వి.జి.సరిత, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వి.కామరాజు, హెల్త్ కేర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ అనిల్ కుమార్, ఆకాష్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ శంకర్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *