Breaking News

అవగాహనతో ఎయిడ్స్‌ను జయిద్దాం

-ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-హెచ్‌ఐవీని నియంత్రించడంలో క్రమం తప్పకుండా మందుల వినియోగం కీలకం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అవగాహన, అప్రమత్తత, సకాలంలో వైద్య పరీక్షలు, క్రమం తప్పకుండా మందుల వినియోగంతో హెచ్‌ఐవీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు.

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ర్యాలీని ప్రారంభించడంతో పాటు స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హెచ్‌ఐవీ నివారణ, నియంత్రణ, చికిత్స, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా నినాదాలు, ప్లకార్డులతో చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, మందులను వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వినియోగిస్తే హెచ్‌ఐవీని నియంత్రణలో ఉంచుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. హెచ్‌ఐవీపై అనుమానం ఉన్నవారు లేదా ప్రమాదకర పరిస్థితులకు గురైన వారు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతూ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.

ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.స్మరణ రాజ్ మాట్లాడుతూ హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, వారిపట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణలో అవగాహన కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ముఖ్యంగా యువతకు సరైన సమాచారం అందించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణపై బాధ్యతను పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలను నమ్మకుండా వైద్య నిపుణుల సూచనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ శ్రవణ్ బాబు, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌ఓ భాను నాయక్, ఐఈసీ జేడీ మంజుల, నర్సింగ్ విద్యార్థినులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *