న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
సి.ఎన్. అన్నాదురై కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిశారు.
తిరుపతి, తిరువణ్ణామలై మార్గం రెండు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఎంతో ముఖ్యమైనదని ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మార్గంలో రోజురోజుకూ పెరుగుతున్న రాకపోకలను దృష్టిలో ఉంచుకుని రహదారిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కోరారు.
రహదారి విస్తరణ, అవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి, తిరువణ్ణామలై రహదారి అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజలు, భక్తులు, వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఎంపీలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు.
Prajavartha Online Telugu News