విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పోలింగ్ కేంద్రాలు, ఓటరు నమోదు, ఫారం-6, 7, 8లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయవాడ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 18–20 ఏళ్ల మధ్య యువత ఓటరుగా నమోదు చేసుకునేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి ఫారం-6 సమర్పించేలా ప్రోత్సహించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సూచించారు. మహిళలు, వయోవృద్ధులు, వికలాంగులు, కొండ ప్రాంతాల ప్రజలను చిన్న చిన్న లోపాల కోసం దూరప్రాంత కార్యాలయాలకు పిలిపించకుండా ఇఆర్వో, ఎఇఆర్వో స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాల సవరణకు ఈసీఐ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించాలని, 48 గంటలకు పైబడి పెండింగ్‌లో ఉన్న బిఎల్ఓ కాల్స్ నాన్-రెస్పాన్స్ కేసులను, ఎన్జీపిఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఇసిఐ నెట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపిల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్ హ్యాండోవర్ పూర్తయిందని, బిఎల్ఓ, బిఎల్ఎస్ సమావేశాల మినిట్స్ అప్లోడ్ చేసి నోటీసులు జనరేట్ చేసినట్లు తెలిపారు. నోటీసుల డెలివరీ 57 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. ఎస్ఎల్ఎ దాటి పెండింగ్‌లో ఉన్న సుమారు 9 వేలు ఫారం-6, 6 వేలు ఫారం-8 దరఖాస్తులను వేగంగా పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు అవగాహన కోసం ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 48 గంటలకు పైబడి పెండింగ్‌లో ఉన్న 29 కేసుల్లో కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించినట్లు, ఎన్జీపిఎస్ కింద రూ.3 వేలకుపైబడిన మొత్తాలకు సంబంధించి నాలుగు ప్రతిపాదనలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇఆర్వో లాగిన్‌లో ఆధార్ లింకింగ్ అభ్యర్థనలు పెద్ద సంఖ్యలో ఒకే చోట చేరడంతో పనుల వేగం తగ్గుతోందని, దీనికి సాంకేతిక పరిష్కారం చూపాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కోరారు.
Prajavartha Online Telugu News