-పౌష్టికాహార లోపం లేకుండా చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-వయసుకు తగ్గ బరువు లేని పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం
-తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పునాదిగా నిలిచి, వారికి మంచి భవిష్యత్తును అందించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గురువారం జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు తండా సక్షం అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలు, పౌష్టికాహార కార్యక్రమాల అమలు, విద్యాబోధన, ఆటపాటల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి అందజేసిన టీవీ, ఆర్వో ప్లాంట్, పెయింటింగ్స్, ఆట వస్తువులు తదితరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వాటిని చిన్నారుల అవసరాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగిస్తున్నారా అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, చిన్నారులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. వయసుకు తగ్గ బరువు లేని చిన్నారుల వివరాలను సంబంధిత యాప్‌లో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. యాప్‌లో నమోదైన వివరాలకు అనుగుణంగా చిన్నారుల బరువును స్వయంగా తూయించి క్రాస్ చెక్ చేశారు. పిల్లల ఎదుగుదల, బరువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులతో జిల్లా కలెక్టర్ కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. వారు నేర్చుకున్న పాటలను చిన్నారులతో పాడించి, వారిని ఉత్సాహపరిచారు. ఆటపాటల ద్వారా పిల్లల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందేలా అంగన్వాడి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, చిన్నారుల బాల్య దశలో ఆటపాటలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ వయసులో పిల్లలకు ఆటలు, పాటలు, విద్యాబోధనను సమన్వయం చేస్తూ అందిస్తే వారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల్లో సృజనాత్మకత, నేర్చుకునే ఆసక్తి, సామాజిక నైపుణ్యాలను పెంపొందించే కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాంటి పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, వారి తల్లిదండ్రులకు కూడా పిల్లలకు అందించాల్సిన పోషకాహారం, సమతుల్య ఆహారం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత, పరిమాణం, పంపిణీ తదితర అంశాలను పర్యవేక్షించాలని, బాలామృతం సక్రమంగా అందిస్తున్నారా లేదా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అంగన్వాడి కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణపై చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో జి.అనిల్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ పి.మనోహర్, ఎంపీడీవో, సీడీపీఓ జి.సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News