Breaking News

ఘనంగా రమేష్ హాస్పిటల్స్ 38వ వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
1988 ఆగస్టు 15న కేవలం ఆరు పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్, నేడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు వారి స్వస్థలానికే చేరువ చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని సంపాదించిన సేవా సంస్థగా నిలిచింది.

ప్రస్తుతం రమేష్ హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, తిరువూరు కేంద్రాల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, అవయవ మార్పిడి, డిజిటల్ ఆరోగ్య సేవలు, గ్రామీణ ఆరోగ్య సేవలు, వైద్య విద్య, పరిశోధన వంటి అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తోంది.

ఈ 38 ఏళ్ల విజయవంతమైన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న విజయవాడలోని ప్రముఖ హోటల్‌లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి. సోమరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను రాయితీలతో మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన రమేష్ ప్రీమియం హెల్త్ కార్డ్ ను ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.సి. దాస్ చేతుల మీదుగా ప్రారంభించారు.

గుండె వైద్య రంగంలో కొత్త మైలురాళ్లు:
గుండె వైద్య రంగంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎన్నో కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తొలి డిజిటల్ క్యాథ్ ల్యాబ్, అత్యాధునిక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సేవలు, అధునిక సాంకేతికలతో రోబోటిక్, మినిమల్ ఇన్వేజివ్ గుండె శస్త్రచికిత్సలు, ECMO వంటి ప్రాణరక్షక చికిత్సలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి వేలాది మంది ప్రాణాలను కాపాడింది.

గ్రామీణ ప్రాంతాలకు చేరువైన నిపుణుల వైద్య సేవలు:
నాణ్యమైన వైద్యం నగరాలకే పరిమితం కాకూడదనే లక్ష్యంతో 24 గంటల కార్డియాక్ రిపోర్టింగ్ సేవను ప్రారంభించింది. గ్రామాల్లో తీసిన ECGను నిమిషాల వ్యవధిలో నిపుణులైన కార్డియాలజిస్టులు పరిశీలించి చికిత్సకు అవసరమైన సూచనలు అందించే విధానాన్ని అభివృద్ధి చేసింది. దీంతో గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర’లోనే చికిత్స ప్రారంభించి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగింది.

సాంకేతికతతో చేరువైన ఆరోగ్య సేవలు :
టెలీమెడిసిన్, టెలీ-ఐసీయూ, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు, క్లౌడ్ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, రిమోట్ మానిటరింగ్, 5G ఈ-అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టి నిపుణులైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. రోగి ఆసుపత్రికి చేరుకునేలోపే వైద్య బృందానికి అవసరమైన సమాచారం అందేలా వ్యవస్థను అభివృద్ధి చేసి అత్యవసర వైద్య సేవల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

అవయవ మార్పిడి వైద్యంలో విశేష విజయాలు :
2016లో గుంటూరులో సమగ్ర అవయవ మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది. 2017లో తొలి కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు, 2026లో తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 40కు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించింది.

వైద్య విద్య, పరిశోధనకు ప్రాధాన్యం :
వైద్య సేవలతో పాటు వైద్య విద్య, పరిశోధనలకు కూడా సంస్థ సమాన ప్రాధాన్యం ఇస్తోంది. NBE గుర్తింపు పొందిన DNB కార్డియాలజీ కార్యక్రమం, వివిధ స్పెషాలిటీ శిక్షణలు, ఆర్.హెచ్. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ద్వారా భవిష్యత్ వైద్యులు, నర్సింగ్ నిపుణులను తీర్చిదిద్దుతోంది. దేశ, విదేశాల ప్రముఖ నిపుణులతో కలిసి 100కు పైగా నిరంతర వైద్య విద్యా (CME) కార్యక్రమాలను నిర్వహించి ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని వైద్యులకు చేరవేస్తోంది.

రోగితో ప్రతి అడుగులోనూ :
రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా టెలీమెడిసిన్, టెలీ-ఐసీయూ, హోమ్ కేర్, డిజిటల్ ఫాలో-అప్ సేవల ద్వారా నిరంతర వైద్య సహాయాన్ని అందిస్తోంది. చికిత్స పూర్తయ్యే వరకు మాత్రమే కాదు, పూర్తిగా కోలుకునే వరకు కూడా రోగికి అండగా నిలవాలనే సేవా తత్వాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.

38 ఏళ్ల విజయానికి బలమైన పునాది :
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ విజయానికి కారణం కేవలం ఆధునిక సాంకేతికత మాత్రమే కాదు. వైద్యుల నిబద్ధత, నర్సుల సేవా స్పూర్తి, ఉద్యోగుల అంకితభావం, రోగుల విశ్వాసం, సమాజం అందించిన ఆదరణే ఈ విజయానికి నిజమైన పునాది. ఈ కార్యక్రమంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఛైర్మన్ శ్రీ ఎం.ఎస్. రామమోహనరావు, డైరెక్టర్ శ్రీమతి మధు స్మిత డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత, యూనిట్ హెడ్‌లు డాక్టర్ సుమ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ నితిన్, సీనియర్ వైద్యులు, కన్సల్టెంట్లు, ఉద్యోగులు, ఆరోగ్య రంగ ప్రముఖులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

డాక్టర్ పోతినేని రమేష్ బాబు సందేశం :
ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ, “గత 38 సంవత్సరాలుగా ప్రజలు మాపై ఉంచిన విశ్వాసమే మాకు లభించిన అతిపెద్ద అవార్డు. ప్రతి రోగిని మా కుటుంబ సభ్యుడిగా భావిస్తూ, సురక్షితమైన, నాణ్యమైన, రోగి-కేంద్రిత వైద్య సేవలను అందించడమే మా ప్రయాణానికి మూల సూత్రం” అని అన్నారు.

“JCI, NABH, NABL, Nursing Excellence, Pharma de Quality వంటి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులతో పాటు స్థానిక సంస్థలు అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పురస్కారాలు మా సేవా నాణ్యతకు నిదర్శనం” అని పేర్కొన్నారు. “ప్రివెంటివ్ కార్డియాలజీ కార్యక్రమాల ద్వారా 5,000కు పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాం. వేలాది మందికి ఉచిత ఈసీజీ పరీక్షలు చేశాం. లక్షకు పైగా విద్యార్థులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) శిక్షణ అందించాం. 100కు పైగా CME కార్యక్రమాల ద్వారా వైద్యులకు అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం.” అని వివరించారు.

“గిన్నీస్ వరల్డ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, డాక్టర్ శరణ్ ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ ఏషియన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపులు లభించినా, మా దృష్టిలో అత్యంత గొప్ప అవార్డు రోగి ఆరోగ్యంగా కోలుకుని చిరునవ్వుతో తన కుటుంబానికి చేరుకోవడమే.” అని అన్నారు.

ప్రస్తుతం మా సంస్థలో సుమారు 3,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 80% మంది 40 సంవత్సరాల లోపు వయస్సు గల మిలీనియల్ యువతరానికి చెందినవారు. ఈ యువతరం రాబోయే రెండు దశాబ్దాల పాటు మా స్ఫూర్తితో సంస్థను ముందుకు నడిపిస్తూ, సంస్థ యొక్క విలువలు, నైతికత, పారదర్శకత మరియు సేవాదృక్పథాన్ని కొనసాగించనుంది. అదే సమయంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, టెక్నాలజీలో అత్యుత్తమతను, వైద్య సేవల్లో క్లినికల్ ఎక్సలెన్స్‌ను సాధిస్తూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడమే మా లక్ష్యం అని డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *