-వెలిగొండ నిర్వాసితులకు నెలాఖరులోగా 600కోట్లు ఇస్తాం.
-విశాఖలో డేటాసెంటర్లకు 3 టిఎంసిల గోదావరి జలాలు.
-36 ప్రాజెక్టుల నెలవారీ వర్క్ ఫ్రోగ్రెస్ ఇవ్వాలని సిఎం ఆదేశించారు.
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం,వెలిగొండ ప్రాజెక్టు లతో పాటు మొత్తం 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు, ఐడిసి లిఫ్ట్స్ స్కీం, వంటి అంశాలతో పాటు,ఎల్ నినో వంటి సందర్భంలో త్రాగునీటి అవసరాల నిమిత్తం ఏ రకంగా ప్రణాళిక తీసుకుంటున్నాం అనే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతి సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పోలవరం ప్రాజెక్టు సివిల్ వర్క్స్ 90% పూర్తయ్యాయని, భూసేకరణ 94% పూర్తిచేశామని,అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులకు తరలింపు 52% పూర్తయిందని, ఇలా మొత్తం పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 77% పూర్తి చేయడం జరిగిందని స్పష్టం చేశారు.మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా త్వరితగతిన, అంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.అందులో ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్, అదేవిధంగా భూసేకరణకు సంబంధించి,కాలనీలకు సంబంధించిన పనులు డిసెంబర్ నాటికి పూర్తయ్యే విధంగా అంటే ప్రాజెక్టును ప్రారంభించడానికి ఆరు నెలలు ముందుగానే ఒక షెడ్యూల్ ని కూడా రూపొందించుకుని, ఆ షెడ్యూల్ ప్రకారం ఆర్ అండ్ ఆర్, భూసేకరణ, కాలనీలు పూర్తి కావాలని సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని తెలిపారు.
అదేవిధంగా పోలవరం అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుగానే కాదు, భవిష్యత్తులో ఒక టూరిజం హబ్ గా కూడా చేసేవిధంగా, 10,000 ఎకరాలతో రేడియల్ సర్వే చేసి, అభివృద్ధి చేయడంతో పాటు, పోలవరం స్పిల్ వే కి సంబంధించి బ్యూటిఫికేషన్, అదేవిధంగా కనెక్టివిటీ బ్రిడ్జ్ ని కూడా ఐకానిక్ మోడల్ లో తయారు చేసుకోవడం, హైవేస్ కనెక్టివిటీ గాని, పోలవరం ప్రాజెక్ట్ నుంచి భద్రాచలం వరకు కూడా రివర్ బేస్డ్ టూరిజాన్ని అభివృద్ధి వంటి అంశాలపై చర్చించడం జరిగిందని అన్నారు.
2027 మార్చి నాటికే పోలవరం పూర్తి.
ఈవిధంగా పోలవరం ప్రాజెక్టుకు వాస్తవంగా ఇచ్చినటువంటి షెడ్యూల్ 2027 డిసెంబర్, కానీ చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి, పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేయండి, మార్చి నెలకే అని ఆదేశాలు ఇచ్చారని, దాని ప్రకారమే ఈ 2027 మార్చి కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంగానే పనులు జరుగుతూ ఉన్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల మొదటి సారి, గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినటువంటి పరిస్థితిలో కూడా పనులు ఆగకుండా జరుగడం పట్ల సిఎం చంద్రబాబు అభినందించారని తెలిపారు.అందుకే గ్యాప్-1 ఈసిఆర్ఎఫ్ పనులు 48%, గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ పనులు 36% పూర్తయ్యాయని వివరించారు.ఈవిధంగా ఈసిఆర్ఎఫ్ డిజైన్స్ ప్రకారం 45.72 మీటర్లకు పూర్తి చేసుకోగలుగుతున్నామని, ఈసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం వల్ల ఆప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న గండిపోచమ్మ దేవాలయాన్ని పరిరక్షిస్తూ,స్దానికుల సెంటిమెంట్ ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని సిఎం ఆదేశించారని అన్నారు మంత్రి నిమ్మల.
పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్న దశ నుంచి, 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తున్నాము అనేటటువంటి భరోసాను ప్రజలకు కల్పించామని స్పష్టం చేశారు.
అదేవిధంగా పోలవరానికి సంబంధించిన ఎడమ ప్రధాన కాలువ(LMC) 2019 – 2024 ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రాకి సాగునీరు, తాగునీరు,విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాలకు సైతం నీళ్ళిచ్చే పోలవరం ఎడమ ప్రధాన కాలువను ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి, ఆ ప్రాజెక్టుని నీరుగారిస్తే, మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1500 నుండి 1800 కోట్ల రూపాయలు ఖర్చుచేసి, ఎల్ఎమ్‌సి (లెఫ్ట్ మెయిన్ కెనాల్) చాలా క్రిటికల్ వర్క్స్ తో పాటు, 11 చోట్ల నేషనల్ హైవేస్ క్రాస్ చేసేటటువంటి క్రిటికల్ వర్క్స్ ని సైతం అధిగమించామని అన్నారు. పంపా,తాండవ,ఏలేరు రిజర్వాయర్ అదేవిధంగా వరాహ ఇటువంటి నదులను అన్నీ కూడా, క్రాస్ చేసేటటువంటి కెనాల్ వర్క్స్ గాని, ఇలా క్లిష్టమైన పనులను కేవలం రెండేళ్ళలోనే పూర్తి చేసుకుని, ఈ నెలాఖరు కల్లా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుండి నీటిని విడుదల చేసి, ఉత్తరాంధ్రాకి అనకాపల్లి వరకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు.
విశాఖ డేటా సెంటర్లకు గోదావరి జలాలు.
కొంతమంది వైసిపి పార్టీ నాయకులు మాట్లాడుతూ విశాఖపట్నంలో గూగుల్ తో పాటు వచ్చే ఇతర డేటా సెంటర్స్ కు నీళ్లే లేవని మాట్లాడుతూ ఉన్నారు.వాళ్ల పరిపాలన ఉంటే అట్లానే ఉంటుంది.కానీ ఈరోజు పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన,చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి విశాఖకి గాని, ఉత్తరాంధ్రాకి గాని పుష్కలంగా నీరు వస్తుంది. గూగుల్ గాని, ఇతర డేటా సెంటర్స్ గాని మొత్తం సంవత్సరానికి మూడు టిఎంసి ల నీళ్లు అవసరం అవుతాయని, ఆనీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అందిస్తామని అన్నారు.
వెలిగొండ నిర్వాసితులకు 600 కోట్లు క్లియర్ చేయబోతున్నాం.
మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టు. ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా హెడ్ రెగ్యులేటర్స్, టన్నెల్స్ లో లైనింగ్, బెంచింగ్, ఫీడర్ కెనాల్ కి సంబంధించినటువంటి సిసి వాల్, ఫీడర్ కెనాల్ సిసి లైనింగ్, నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ పనులన్నిటినీ కూడా ఈ నెల 25కి పూర్తి చేసుకుంటూ, దానితో పాటుగా. టన్నెల్-2 లో చిక్కుకున్నటువంటి టిబిఎమ్ మిషన్ కూడా, దగ్గర దగ్గర 1900 టన్నుల ఐరన్ కి గానూ, ఇప్పటికీ 1500 టన్నులు తొలగించామని చెప్పారు. మిగిలిన బ్యాలెన్స్ 400 టన్నులని కూడా డిస్మాంటిల్ చేసి అది కూడా కటింగ్ అవ్వకపోతే మళ్లీ గ్రానైట్ కటింగ్ మిషన్ తో సహా, డైమండ్ కటింగ్ మిషన్ ని కూడా తీసుకొచ్చి దానికి కూడా ట్రయల్ చేసి. ఇలా ఇన్ని కష్టాల మధ్య అర్ధరాత్రి కూడా షిఫ్టులు పెట్టుకుని పనులు జరుగుతూ ఉన్నాయి అని అన్నారు.ఇలా ఉంటే, గత ముఖ్యమంత్రేమో, వెలిగొండ పూర్తయిపోయిందని జాతికి అంకితం చేసేసానని ఒక దగా, మోసం చేశాడని, 2026 ఆగస్టు లో కూడా రాత్రి పగలు తేడా అనేది లేకుండా డే అండ్ నైట్ వెలిగొండ పనులు జరుగుతూ ఉన్నాయని వివరించారు.
అదేవిధంగా వెలిగొండ నిర్వాసితులకు గత ఐదేళ్ల పాలనలో 900 కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ఇవ్వాల్సి ఉంటే, ఐదు సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ, ఆ నిర్వాసితులకి ఇవ్వడానికి జగన్ కు మనసు రాలేదని, కానీ జాతికి అంకితం అంటూ, దగా, మోసం చేశాడని దుయ్యబట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి ఇటీవలే 318 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మిగిలినటువంటి నిర్వాసితులకు ఇవ్వవలసిన 600 కోట్లను 17వ తారీకు నుంచి ఒక షెడ్యూల్ ప్రకారం 24వ తేదీ లోపల ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు కూడా గురువారం మార్కాపురం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో గుర్తించి, వాటిని కూడా మానవతా దృక్పథంతో ఎంతవరకు వాళ్లకు సహాయం చేయగలిగితే అంతవరకు కూడా సహాయం చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అని అన్నారు. ఆ రకంగానే హ్యూమన్ గ్రౌండ్స్ లో జెన్యూన్ గా ఎవరైతే ఉంటారో వాళ్లందరికీ కూడా న్యాయం చేసేటటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ క్యాలెండర్ తో పాటు ప్రాజెక్టుల వర్క్ షెడ్యూల్ ఇవ్వాలి.
ఇదేవిధంగా హంద్రీనీవా, ఎల్ఎమ్‌సి (లెఫ్ట్ మెయిన్ కెనాల్), వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక షెడ్యూల్ ఇచ్చాం, ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తూ ఉన్నాం అని, తరువాత పోలవరం ప్రాజెక్టు 2027కి షెడ్యూల్ పెట్టి పూర్తి చేస్తూ ఉన్నాం అని అన్నారు. భవిష్యత్తులో కూడా 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులని పూర్తి చేయడానికి, ఇరిగేషన్ క్యాలెండర్ ని రూపొందించి, ఆ ఇరిగేషన్ క్యాలెండర్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క ప్రగతి కూడా నెలావారీ ప్రణాళిక వేసుకుని… నెలావారీ ప్రణాళిక తోపాటు, వర్క్ ప్రోగ్రెస్. ఏ నెలకానెల కూడా ఆ 36 ప్రాజెక్టుల మీద కూడా త్వరగా ఇవ్వాలని సిఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు.
ఐడిసికి పూర్వ వైభవం తీసుకొస్తున్నాం.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్టులు ఉంటే, అందులో పూర్తిస్థాయిలో పనిచేసేవి కేవలం 150 లిఫ్టులు మాత్రమే. 8 లక్షల ఎకరాల ఆయకట్టు లిఫ్టు స్కీం ల ద్వారా సాగవుతుండగా, ఈ స్కీంలు నిర్వీర్యమైపోవడంతో సగానికి పైగా సాగుదెబ్బతింది. ఐదు సంవత్సరాల వైసిపి పార్టీ పాలనలో ఆ లిఫ్టుల్ని నిర్వీర్యం చేసేస్తే రైతులందరూ కూడా వ్యవసాయం వదులుకున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఆ లిఫ్టులన్నింటినీ కూడా ప్రభుత్వమే తీసుకుని, ప్రభుత్వమే ఆ లిఫ్టుల్ని బాగుచేయడానికి, అదేవిధంగా రిపేర్లు చేయడంతో పాటు, ఇంకొక 10 సంవత్సరాల పాటు ప్రభుత్వమే ఓ అండ్ ఎమ్ కూడా చేసేటటువంటి విధంగా కూడా ముందుకు వెళ్లమని చెప్పి కూడా సిఎం చంద్రబాబు ఆదేశించడం జరిగిందన్నారు. దాని ప్రకారమే రాబోయే రోజుల్లో ఆ లిఫ్టులన్నిటిని ప్రభుత్వమే రిపేర్లు చేయడంతో పాటుగా 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తాగునీటికే మొదటి ప్రాధాన్యత.
ఎల్ నినో, సూపర్ ఎల్ నినో నేపథ్యంలో త్రాగునీటికి ప్రథమ ప్రాధాన్యతని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు చేసిందని,2027 జూన్ వరకు ఇప్పుడున్నా నీటిని భద్రపర్చుకోవాలని సూచించిందని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నీటిపారుదల, రెవెన్యూ,వ్యవసాయ మూడు శాఖలు సమన్వయంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలను రైతులను ఎప్పటికప్పుడు చైతన్యపర్చి అందుబాటులో ఉన్న నీటిని తాగునీటికే ఉపయోగించుకోవాలని చెప్పాలన్నారు.తాగునీటి అవసరాలని మించి ఎక్కడైనా నీళ్లు ఉంటే అది ఆరుతడి పంటలకు మాత్రమే ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.
ఒక్క గోదావరి డెల్టాకు మాత్రమే ఈ ఖరీఫ్ కి వరి సాగుకి ఇస్తున్నామని మిగిలిన ప్రాంతాల్లో త్రాగునీటికే ప్రాధాన్యతని ఆ త్రాగునీటికి మించి ఎక్కడైనా మనకు ఉంటే అది ఆరుతడి పంటలకు మాత్రమే వెళ్లాలి తప్ప మరి వేరే వాటికి ఉపయోగించరాదని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News