విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురుదేవులను సత్కరిం చుకోవటం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని శ్రీషిర్డీసాయిబాబా మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక ముత్యాలంపాడు శ్రీ షిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని పూనూరు సుబ్బరామరెడ్డి మెమోరియల్ సద్గురు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, పూనూరు సుబ్బరామరెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు చేసిన సేవలను కొనియాడారు. భావి భారత సమాజ స్థాపన కోసం శ్రమిస్తున్న అత్యుత్తమ ఉపాధ్యాయులను తాము గుర్తించి ప్రతీ ఏటా పురస్కారంతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను అభినందించారు. తొలుత మందిరంలో 14 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువా జ్ఞాపిక పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు పొన్నలూరి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి కుంచనపల్లి రవిశంకర్, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, శ్రీవాణి ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News