-రెండేళ్లలో ఒక్క రూపాయి ఛార్జీ పెంచలేదు
-6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్
-కూటమి అభివృద్ది, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-స్థానిక సంస్థల్లో విజయంతోనే మరింతగా రాష్ట్ర అభివృద్ధి – ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి
రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై నాశనమైన విద్యుత్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శనివారం నాడు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్., సహచర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమాలు తరువాత మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ.., గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలపై తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీల భారం మోపారని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకు పైగా పూర్తయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సుమారు 280 మిలియన్ యూనిట్లకు పెరిగిందని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లతో పెద్ద సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పాటు విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటి సుమారు రూ.3 కోట్లకు పైగా వ్యయంతో 200కు పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని, తద్వారా లో-వోల్టేజీ, అంతరాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
నూతన నియామకాలతో సిబ్బంది కొరతకు చెక్…
విద్యుత్‌శాఖలో సిబ్బంది కొరత లేకుండా 629 ఏఈఈ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 7 వేల ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి వారి సేవలను కూడా వినియోగించుకుంటామని చెప్పారు. విద్యుత్‌శాఖలో 90 శాతం సంతృప్తి స్థాయి సాధించేలా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా సబ్సిడీతో కోటి సోలార్ కనెక్షన్లను మంజూరు చేస్తే., అందులో 20 లక్షలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని మంత్రి వెల్లడించారు. 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్యఘర్ రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం అందించే రూ.78 వేల సబ్సిడీతో ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోలార్ ఏర్పాటు చేసుకునే బీసీ వర్గాలకు కేంద్ర సబ్సిడీ రూ.78 వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 వేల సబ్సిడీ అందిస్తుందన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పీఎం సూర్యఘర్ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా రూఫ్‌టాప్ యూనిట్లు కదలకుండా ఉండేలా నిర్మాణం చేపట్టాలన్నారు. సోలార్ యూనిట్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు తలెత్తితే సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు సిబ్బంది కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పథకం అమలుపై సంబంధిత ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్ కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా…
అన్నమయ్య జిల్లాలో సుమారు రూ.800 కోట్లతో ఆర్డీఎస్‌ఎస్ పనులు చేపట్టామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రాయచోటిలో ఇప్పటికే రెండు విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, మరో రెండు సబ్‌స్టేషన్లు కావాలని కోరారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రెండు పూర్తయిన అనంతరం మిగిలిన రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాయచోటిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి గొట్టిపాటి పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల విజయంపై దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని., పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు పలువురు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News