Breaking News

గిరిజనుల జన్యు రక్త వ్యాధుల ముందస్తుగానే గుర్తింపు

-తలసేమియా, సికిల్‌సెల్‌ కోసం
-రాష్ట్రంలోనే ఉన్న ఏకైక ప్రత్యేక ల్యాబ్‌లో 3 నెలల్లో 121 పరీక్షలు
-94 మందిలో సమస్యల గుర్తింపు..
-వైజాగ్ లోని KGH కేంద్రంగా పరీక్షలు, చికిత్స ఉచితం..
-గిరిజనుల ఆరోగ్యానికి భరోసా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల ఆరోగ్యానికి మరింత భరోసా పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ కంపిటెన్స్‌ (సీఓసీ) ల్యాబ్‌ ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ కేంద్రం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ప్రాంతీయ నిర్ధారణ కేంద్రంగా సేవలందిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యేక దృష్టితో గిరిజన ప్రాంతాల ప్రజలకు అధునాతన వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజీహెచ్ లో ఉన్న కేంద్రంలో ఇటీవల వరకు 121 రక్త నమూనాలను పరీక్షించగా, 94 నమూనాల్లో జన్యుపరమైన హీమోగ్లోబిన్‌ వైవిధ్యాలు లేదా క్యారియర్‌ స్థితులు గుర్తించారు. పరీక్షలు, జన్యు సలహాలు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.

94 మందిలో జన్యు వైవిధ్యాలు

పరీక్షల్లో 33 మందిలో సికిల్‌సెల్‌ ట్రైట్‌ (హెచ్‌బీఏఎస్‌) క్యారియర్‌ స్థితి, 23 మందిలో హోమోజైగస్‌ సికిల్‌సెల్‌ వ్యాధి (హెచ్‌బీఎస్‌ఎస్‌) గుర్తించారు. మరో 10 మందిలో తలసేమియా ట్రైట్‌, ఆరుగురిలో తలసేమియా మేజర్‌, మరో ఆరుగురిలో సికిల్‌సెల్‌–తలసేమియా కలయిక ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరిలో హెచ్‌బీడీ, హెచ్‌బీసీ, హెచ్‌బీఈ వంటి అరుదైన హీమోగ్లోబిన్‌ వైవిధ్యాలు బయటపడ్డాయి. మొత్తంగా పరీక్షించిన 121 నమూనాల్లో 94 అంటే 77.7 శాతం నమూనాల్లో జన్యుపరమైన హీమోగ్లోబిన్‌ వైవిధ్యాలు లేదా క్యారియర్‌ స్థితులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

అధునాతన పరీక్షలతో నిర్ధారణ

వ్యాధి నిర్ధారణ కోసం కేంద్రంలో హెచ్‌పీఎల్‌సీ, క్యాపిల్లరీ ఎలక్ట్రోఫోరెసిస్‌, వేరియంట్‌ న్యూబార్న్‌ స్క్రీనింగ్‌ వంటి ప్రత్యేక పరీక్షా విధానాలను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు హెచ్‌పీఎల్‌సీ ద్వారా 70 నమూనాలు, క్యాపిల్లరీ ఎలక్ట్రోఫోరెసిస్‌ ద్వారా 49 నమూనాలు, వేరియంట్‌ న్యూబార్న్‌ స్క్రీనింగ్‌ ద్వారా రెండు నమూనాలను పరీక్షించారు.

నాలుగు జిల్లాలకు ప్రాంతీయ కేంద్రం

కేజీహెచ్‌ సీఓసీ ల్యాబ్‌ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ప్రాంతీయ నిర్ధారణ కేంద్రంగా సేవలందిస్తోంది. కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక గిరిజన ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు ఇక్కడికి వస్తున్నాయి. జాతీయ సికిల్‌సెల్‌ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్‌ కేంద్రాలు, పరిధి వైద్య కేంద్రాల నుంచి సేకరించే స్క్రీనింగ్‌ నమూనాలను కూడా ఇక్కడ పరీక్షిస్తున్నారు.

కోల్డ్‌చైన్‌తో నమూనాల తరలింపు

మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే నమూనాల నాణ్యత దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రక్త నమూనాలను ఈడీటీఏ ట్యూబుల్లో సేకరించి, అవసరమైన వివరాలతో పాటు భద్రపరుస్తున్నారు. ఫీల్డ్‌ కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల నుంచి నమూనాలను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో కోల్డ్‌ బాక్సుల్లో తరలిస్తున్నారు. ల్యాబ్‌కు చేరిన తర్వాత రోగి వివరాలు, నమూనా పరిమాణం, ఉష్ణోగ్రత రికార్డులు, నమూనా నాణ్యతను పరిశీలించిన అనంతరమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పరీక్షతో పాటు చికిత్స

వ్యాధి నిర్ధారణతో సేవలు ముగియడం లేదు. కేజీహెచ్‌లోని వివిధ విభాగాల సమన్వయంతో రోగులకు చికిత్స, దీర్ఘకాలిక వైద్య పర్యవేక్షణ అందిస్తున్నారు. బాలల విభాగం సికిల్‌సెల్‌ వ్యాధి, తలసేమియా మేజర్‌తో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది. అవసరాన్ని బట్టి ప్రత్యేక రక్త మార్పిడులు, హైడ్రాక్సీయూరియా, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి చికిత్సలు, సంబంధిత టీకాలపై పర్యవేక్షణ చేస్తున్నారు. నివేదిక ప్రకారం జూన్‌లో ఆరుగురు యాక్టివ్‌ కేసులను, జూలై–ఆగస్టులో ఇప్పటివరకు ముగ్గురు యాక్టివ్‌ కేసులను బాలల విభాగం నిర్వహించింది.

పెద్దలకు, గర్భిణులకు ప్రత్యేక పర్యవేక్షణ

పెద్దల కోసం జనరల్‌ మెడిసిన్‌ విభాగం సికిల్‌సెల్‌, తలసేమియా రోగులను పర్యవేక్షిస్తోంది. నొప్పి సంక్షోభాలు, ఇతర సమస్యలు, కాలేయం–మూత్రపిండాల పనితీరు, దీర్ఘకాలిక మందుల ప్రభావం, రక్త మార్పిడులు వంటి అంశాలను పరిశీలిస్తూ వైద్య సలహాలు అందిస్తోంది. ప్రసూతి, స్త్రీ వైద్య విభాగం అధిక ప్రమాద గర్భిణులకు ముందస్తు స్క్రీనింగ్‌, క్యారియర్‌ దంపతులకు జన్యు సలహాలు, వంశపారంపర్య రక్తహీనతతో కూడిన గర్భధారణల నిర్వహణలో సేవలు అందిస్తోంది.

రూ.2.85 కోట్లతో మౌలిక వసతులు

కేంద్రం ఏర్పాటుకు రూ.2.85 కోట్ల విలువైన పరికరాల మౌలిక వసతులు సమకూరాయి. పరికరాల నిర్వహణ కోసం రూ.16.93 లక్షలు వార్షిక నిర్వహణ ఒప్పందాల (ఏఎంసీ) కింద కేటాయించారు. రియాజెంట్లు, పరీక్షా కిట్ల కోసం రూ.45.54 లక్షలు కేజీహెచ్‌ సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు జమ చేసి వినియోగానికి కేటాయించారు. ఈ సహకారంతో కేంద్రంలో నిర్వహించే నిర్ధారణ పరీక్షలు, జన్యు సలహాలు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను రోగులకు 100 శాతం ఉచితంగా అందిస్తున్నామని KGH సూపరింటెండెంట్ ఇ. వాణి తెలిపారు.

ముందస్తు గుర్తింపుతో ప్రయోజనం

తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలు కావడంతో ముందస్తు గుర్తింపు, సరైన వైద్య పర్యవేక్షణ, కుటుంబాలకు జన్యు సలహాలు కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోనే స్క్రీనింగ్‌ పెంచి, నమూనాలను కేజీహెచ్‌ వంటి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షించడం ద్వారా వ్యాధిని తొలిదశలో గుర్తించే అవకాశం పెరుగుతుంది. బాధితులకు సకాలంలో వైద్యం అందించడంతో పాటు, భవిష్యత్‌ తరాలకు వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు అధునాతన పరీక్షలు, వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *