-గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్దరణ
-ఈహెచ్ఎస్ స్ట్రీమ్ లైన్… 2022 ఏడాది సరెండర్ లీవుల విడుదల
-ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
-ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగుల హర్షం.. ప్రభుత్వానికి సహకరిస్తామని వ్యాఖ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పే-రివిజన్ కమిషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పెండింగులో ఉన్న 4 డీఏల్లో 2 డీఏల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన పెండింగ్ అంశాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్ర ఆదాయ-వ్యయాల లెక్కలను ఉద్యోగుల ముందు ఉంచారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా…. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలతతో ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. 12వ పీఆర్సీ నియామకానికి అంగీకరించారు. అలాగే 1-7-2024, 1-1-2025లకు చెందిన రెండు డీఏల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు. ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవులను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాలో వేయడానికి అంగీకరించారు. ఇక పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్‌ను ఈ దసరాకు చెల్లించేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షనర్ల అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంట్లో భాగంగా 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింప చేయనున్నారు. ఇక ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్ చేస్తూ వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఏటా రూ.2,880 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు కానుంది.
రూ.30 వేల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు చెల్లించాం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…” మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా… గత రెండేళ్ల కాలంలో ఒకటో తేదీన క్రమం తప్పకుండా జీతాలు ఇస్తున్నాం.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తున్నాం. 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపచేశాం. ఉద్యోగులకు సంబంధించి ఉన్న పెండింగ్ బిల్లుల్లో ఇప్పటి వరకు రూ.30,849 కోట్లు క్లియర్ చేశాం. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వడ్డీలకు అప్పులు తెచ్చింది. ఆర్థిక సంస్థలతో చర్చించి రూ.1.50 లక్షల కోట్ల మేర అప్పులపై భారీగా ఉన్న వడ్డీలను రీ షెడ్యూల్ చేసి తగ్గించుకోగలిగాం. ప్రస్తుతం సరాసరి 9.1 శాతం వడ్డీని ప్రభుత్వం అప్పులపై చెల్లిస్తోంది. ఈ భారాన్ని ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. విధ్వంసమైన వ్యవస్థలను నెమ్మదిగా గాడిన పెడుతున్నాం. గత పాలకులు ఉద్యోగులను దగ్గరకే రానీయలేదు. రివర్స్ పీఆర్సీ ఇచ్చారు… అలాంటి పరిస్థితులు ఉద్యోగులు మరిచిపోవద్దు. గత ప్రభుత్వం రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను కూడా పెండింగులో పెట్టింది. ఉద్యోగులను అవమానించేలా వాలంటరీలతో కరపత్రాలు పంపిణీ చేయించారు.. హోర్డింగులు పెట్టించారు… పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మధ్యవర్తులతోనే మాట్లాడే పరిస్థితి నాడు ఉండేది. సమస్యల పరిష్కారం కోసం నాటి సీఎం కాళ్లు పట్టుకోవాలని అప్పుడు మంత్రులుగా ఉన్న వారు కామెంట్లు చేశారు… అవమానించారు. మంచికి చెడుకు ఉన్న వ్యత్యాసాన్ని ఉద్యోగులందరూ గుర్తించాలి. మేం ఉద్యోగులను గౌరవిస్తున్నాం… సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదని వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సానుకూలంగా ఉంటాం. ఆర్థిక వెసులుబాటు ఉంటే ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. 2014లో నాడు విభజన తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేశాం. విభజనకు వ్యతిరేకంగా పోరాడింది ఉద్యోగులే. వారిని గౌరవించాలని.. ఇబ్బందులు వస్తాయని తెలిసినా… 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఉద్యోగులు వారి సమస్యల గురించి.. యూనియన్ల కోసం పని చేస్తారు. నేను రాష్ట్రం కోసం… ప్రజల కోసం ఆలోచించాలి. ఇందులో ఉద్యోగులూ భాగమే.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
గత పాలకుల నిర్వాకం వల్ల పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నాం: ఉద్యోగులు
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను.. డిమాండ్లను నెరవెరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నేతల హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల సానుకూలత కనబరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో పీఎఫ్ లోన్లను కూడా ఇవ్వకుండా వేధించడం వల్ల పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. రిటైర్మెంట్ ఉద్యోగులకు మేలు చేసేలా ఉన్న అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను గత ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్దరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును పెంచినందుకూ కృతజ్ఞతలు తెలియచేశారు. రాష్ట్రానికున్న ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని… రాష్ట్రాభివృద్ధికి, ప్రభుత్వానికి తమ వైపు నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని ఉద్యోగులు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News