-పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
-ఎస్సీ, ఎస్టీల ఆర్థిక సాధికారతకు సమగ్ర కార్యాచరణ
-ఏజెన్సీ ప్రాంతాల్లో అవకాశాలు కాదు… అవగాహన లేకే వెనుకబాటుతనం
-ఎస్సీ, ఎస్టీ హైపవర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ వేగంగా జరిపి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా కోర్టుల్లో పరిష్కరించేలా చూడాలని, ప్రత్యేక సెషన్ కోర్టులు, స్పెషల్ కోర్టుల్లో కేసులను రేషనలైజ్ చేసి పరిష్కరించాలని సీఎం సూచించారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, తప్పు చేసిన వారికి శిక్షపడేలా వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి అత్యున్నత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్యారోగ్యం తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు. గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదైన అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కేసుల సంఖ్యతో పాటు వాటి స్వభావం, కారణాలు, పరిష్కారానికి పడుతున్న సమయం వంటి అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు అందుతున్న పరిహారం సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిహారంతో పాటు హౌసింగ్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా బాధితులకు త్వరితగతిన అందించాలని సూచించారు.
ఎప్పటికప్పుడు జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు
జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన సమావేశాలు ఇంకా 131 పెండింగ్‌లో ఉండటంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా ఈ సమావేశాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక వెలువడి రెండున్నర దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో అప్పటి పరిస్థితులు, ప్రస్తుతం వచ్చిన మార్పులను సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. గతంలో ఉన్నట్టుగా రెండు గ్లాసుల విధానం, దేవాలయాల్లోకి ప్రవేశం వంటి వివక్షలు ఇప్పుడు లేవని ..ఎస్సీ, ఎస్టీల్లో ఆర్థిక సాధికారత కల్పించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెంచేలా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఇంక్లూజివ్ గ్రోత్ సాధించేలా కృషి చేయాలని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులను ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే స్థాయికి తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుతున్న హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడం వల్ల మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల నుంచి కనీసం 5 నుంచి 10 శాతం మంది విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా నాణ్యమైన విద్య అందించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇటువంటి మంచి అంశంపైనా కొన్ని పార్టీలు వివాదం సృష్టిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుని ప్రగతి సాధించకూడదన్న ఉద్దేశంతోనే వారు ఈ అంశాన్ని వివాదం చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు.
ఫైనాన్స్ కార్పొరేషన్‌తో ఉపాధి కార్యక్రమాలు
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని సంక్షేమ పథకాలలో లీకేజీలు లేకుండా చూస్తూ ఆయా నియోజకవర్గాన్ని ఓ మోడల్ గా అభివృద్ధి చేసేలా అంతా సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పీ4, ఎంబీకే 10-20 వంటి కార్యక్రమాలను సమర్థంగా వినియోగించుకుంటే ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ వంటి వాణిజ్య పంటలు, అటవీ ఉత్పత్తుల ద్వారా గిరిజనుల ఆదాయాలను పెంచే అవకాశాలను వినియోగించుకోవాలని వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో అవకాశాలు లేక కాదు.. అవగాహన లేక మాత్రమే వెనుకబాటుతనం ఉంటోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వాటిని ఆదాయ వనరులుగా మార్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల హాస్టళ్లలో నెట్‌జీరో విధానాన్ని అమలు చేయాలని… విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, మౌలిక వసతులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువత నైపుణ్యంపై దృష్టి పెట్టి స్థానికంగా ఉద్యోగాలతోపాటు విదేశాల్లోనూ అవకాశాలు దక్కించుకునేలా ప్రయత్నిస్తామన్నారు. గత పాలనలో ఎస్సీఎస్టీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేశారని కూటమి ప్రభుత్వం వచ్చాకే వాటిని పునరుద్ధరించామని వివరించారు.
ఫిర్యాదులపై తక్షణ స్పందన
ఎస్సీ,ఎస్టీ హాస్టళ్లలో టీచర్లు నివాసం ఉండేలా చూడాలని ఎమ్మెల్యే కొండ్రు మురళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ గ్రామాలు, రహదారులపై హరిజన వాడ అనే పేర్లను మార్చాలంటూ పూతలపట్టు శాసనసభ్యుడు మురళీమోహన్ ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనులు ట్రైకార్ రుణాలను పెంచాలని వచ్చిన అభ్యర్ధనపైనా సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి మంత్రులు డీబీవీ స్వామి, వి.అనిత, జి. సంధ్యారాణి, ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్ సహా రాష్ట్ర వ్యాప్త ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల శాసనసభ్యులు, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News