– ‘నో-బిడ్’లు తగ్గుముఖం.. కొనుగోలుదారుల పోటీతో మెరుగవుతున్న ధరలు
– వచ్చే ఏడాది పంట నియంత్రణతో మార్కెట్‌కు అనుగుణంగా ఉత్పత్తి
– సీఎం చంద్రబాబు ఆదేశాలతో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా చర్యలు
– వేలం కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 FCV పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, మార్గదర్శకత్వంతో పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్, గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. తాను కూడా పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 4 నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల FCV పొగాకు మార్కెట్ అయిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్‌కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా, అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. ఇప్పటివరకు నమోదైన సగటు ధర కిలోకు రూ.209.83గా ఉందని వెల్లడించారు. గత ఏడాది ఇదే 132 వేలం రోజుల నాటికి 140.27 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ కాగా, తుది సగటు ధర కిలోకు రూ.248.86గా నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో సర్ప్లస్ ఏర్పడటంతో కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ, ఇటీవల వేలాల్లో కొనుగోలుదారుల స్పందన, పోటీ గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.
తగ్గుతున్న ‘నో-బిడ్’లు.. పెరుగుతున్న కొనుగోలుదారుల పోటీ
ఇటీవల వేలం కేంద్రాల్లో ‘నో-బిడ్’ బేల్స్ శాతం గణనీయంగా తగ్గిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా సగటున 11–12 శాతం వరకు ‘నో-బిడ్’లు నమోదవుతున్నాయని, కొన్ని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో ఇది 1–2 శాతం కంటే కూడా తక్కువగా ఉందన్నారు. ‘నో-బిడ్’లు తగ్గడం, కొనుగోలు కార్యకలాపాలు పెరగడం, కొనుగోలుదారుల మధ్య పోటీ మెరుగుపడటం మార్కెట్‌లో సానుకూల సంకేతాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం వారానికి సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ అవుతోందని తెలిపారు. కొనుగోలుదారుల మధ్య పెరుగుతున్న పోటీ మెరుగైన ధరల సాధనకు దోహదపడుతోందన్నారు.
కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ధరలు
వివిధ వేలం ప్రాంతాల్లో కూడా మార్కెట్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని మంత్రి తెలిపారు. NLS ప్రాంతంలో అత్యధికంగా కిలోకు రూ.329 వరకు ధర లభించిందన్నారు. SLSలో అత్యధిక బిడ్ రూ.255, SBSలో రూ.252గా నమోదైందని వెల్లడించారు. డిమాండ్ ఉన్న గ్రేడ్లు, రకాల పొగాకుకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి స్పందన లభిస్తోందన్నారు. గత నెల రోజులుగా SLS, SBS ప్రాంతాల్లో కొనుగోలు వేగం, ధరల సాధన వేలం ప్రారంభ దశతో పోలిస్తే మెరుగుపడ్డాయని చెప్పారు.
రైతుల ప్రయోజనాల కోసం నిరంతర పర్యవేక్షణ
పొగాకు పంట మార్కెటింగ్ ప్రక్రియను టొబాకో బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, వ్యాపార ప్రతినిధులతో సమన్వయం చేస్తూ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామన్నారు. వేలాల్లో కొనుగోలుదారులు నిరంతరం పాల్గొనేలా చూడటం, మార్కెటబుల్ పొగాకును కొనుగోలు చేయడం, నివారించగల ‘నో-బిడ్’లను తగ్గించడం, కొనుగోలు షెడ్యూల్‌ను క్రమబద్ధంగా కొనసాగించడం, పంటను త్వరితగతిన మార్కెట్ చేయడం వంటి అంశాలపై వ్యాపార వర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపార వర్గాల ప్రతినిధులతో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని, సీనియర్ అధికారులు వేలం ప్లాట్‌ఫారమ్‌లను సందర్శిస్తూ క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని మంత్రి వివరించారు.
వచ్చే ఏడాది పంట పరిమాణం భారీగా తగ్గింపు
ప్రస్తుత సీజన్‌లో అనుమతించబడిన పంట పరిమాణం, వాస్తవ ఉత్పత్తి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడటంతో మార్కెట్‌లో అధిక పరిమాణంలో పొగాకు అందుబాటులోకి వచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. దీనివల్ల మార్కెట్‌పై ఒత్తిడి ఏర్పడిందన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 2026–27 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో FCV పొగాకు అనుమతించబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించినట్లు మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడటం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. వచ్చే ఏడాది రైతులు అనుమతించబడిన పంట పరిమాణానికి మాత్రమే పరిమితమై సాగు చేసేలా టొబాకో బోర్డు ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన మార్గదర్శకత్వంలో పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్, న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వేలం ప్రక్రియ పూర్తయ్యే వరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News