-రాష్ట్రస్థాయిలో 31 వ వార్డుకు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ గా అవార్డు
-భారత రాజధాని ఢిల్లీలో అవార్డు అందుకున్న కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థకు మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 60వ వార్డు జాతీయ స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డుగా ద్వితీయ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 31వ వార్డుకు స్టేట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డ్ సాధించింది.
జాతీయ స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో గల గంగా ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర మంత్రి కృతి వర్ధన్ సింగ్, కార్యదర్శి తన్మయ్ కుమార్ చేతుల మీదుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రతినిధులు 60వ వార్డుకు సంబంధించిన జాతీయ స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా రూ.30 లక్షల నగదు బహుమతి అందుకున్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, సీడీఎంఏ పి .సంపత్ కుమార్ గార్ల మార్గదర్శకత్వంతో పాటు ప్రజా ప్రతినిధులు, విజయవాడ నగర ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు మీడియా అందించిన సహకారంతోనే సాధ్యమైందని కమిషనర్ తెలిపారు.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లక్ష్యాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ 60వ వార్డులో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పలు కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తోందన్నారు. 60వ వార్డులోని Reduce, Recycle Centre ద్వారా వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (MRF) ద్వారా వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి, పునర్వినియోగం మరియు రీసైక్లింగ్‌కు అనువైన పదార్థాలను తిరిగి వినియోగంలోకి తీసుకువస్తున్నామని వివరించారు.
అదేవిధంగా నిర్మాణ వ్యర్థాలను వినియోగించి ఇటుకల తయారీ, విండ్రో కంపోస్టింగ్ ద్వారా సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టించే విధానాలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేపట్టామని కమిషనర్ తెలిపారు. వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా డస్ట్ ఫ్రీ రోడ్ల లక్ష్యంతో ఎండ్-టు-ఎండ్ రోడ్ల అభివృద్ధి, రహదారుల పరిశుభ్రత మరియు దుమ్ము నియంత్రణ చర్యలను చేపట్టినట్లు తెలిపారు.
అలాగే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మియావాకి విధానంలో మినీ ఫారెస్టుల ఏర్పాటు, మొక్కల పెంపకం, పర్యావరణ హితమైన వాతావరణాన్ని సృష్టించే చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా భవిష్యత్తులో వాహన కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలి అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం, రీసైక్లింగ్, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పచ్చదనం పెంపు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ సమష్టి చర్యల ఫలితంగానే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో 200 మార్కులకు గాను 190 మార్కులు సాధించి 60వ వార్డు జాతీయ స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డుగా ద్వితీయ ర్యాంక్ సాధించిందని కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు.
రాష్ట్ర స్థాయిలోనూ విజయవాడకు మరో గుర్తింపు
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 31వ వార్డు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డుగా అవార్డు సాధించడం మరో విశేషమని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
31వ వార్డు 200 మార్కులకు గాను 200 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. ఈ సందర్భంగా 31వ వార్డుకు రాష్ట్ర స్థాయి బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డు అవార్డుతో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి లభించిందని పేర్కొన్నారు.
31వ వార్డులో పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణ మరియు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు ఈ అవార్డు సాధించడంలో కీలకంగా నిలిచాయని కమిషనర్ తెలిపారు.
ముఖ్యంగా వర్మీ కంపోస్టింగ్ విధానం ద్వారా సేంద్రియ వ్యర్థాల సమర్థ నిర్వహణ, క్రిమిటోరియంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలు, ఏలూరు కెనాల్ బండ్‌పై అభివృద్ధి చేసిన పచ్చదనం, అలాగే పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ వంటి కార్యక్రమాలు 31వ వార్డుకు అవార్డు దక్కేలా చేసిన ముఖ్యమైన అంశాల్లో భాగమని కమిషనర్ వివరించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ఈ అవార్డు ఒక గుర్తింపుగా నిలుస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, విజయవాడ నగర ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి మరియు మీడియా ప్రతినిధులకు కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ విజయవాడను మరింత స్వచ్ఛమైన, పచ్చని, కాలుష్యరహిత మరియు పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News