తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలో నిర్వహించనున్న శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు–2026కు సంబంధించిన మహోత్సవ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ… విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాలు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన అనుమతులను సంబంధిత శాఖల నుంచి ముందుగానే పొందాలని సూచించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో వినాయక మహోత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందకరమైన విషయమని అన్నారు. మహోత్సవ కమిటీ సభ్యులు అందరూ ఐకమత్యంతో పనిచేసి, భక్తుల సహకారంతో ఈ ఏడాది మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రార్థించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు తిరుపతి నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, మహోత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ–2026 నిర్వాహకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News