అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు, హజ్ యాత్రకు సంబంధించిన విమాన ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులు ఎదుర్కొంటున్న అధిక విమాన ఛార్జీల భారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ అవసరం, ప్రయాణ సౌకర్యాలు తదితర అంశాలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అంశాలపై వినతిపత్రాన్ని అందజేశారు.
విజయవాడ నుంచి హజ్ యాత్రికులకు ఎంబార్కేషన్ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు రాష్ట్రంలోని హజ్ యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హాజీ షేక్ హసన్ బాషా వివరించారు.
ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల సంక్షేమం, సౌకర్యాల కోసం రాష్ట్ర హజ్ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని హాజీ షేక్ హసన్ బాషా తెలిపారు.
Prajavartha Online Telugu News