Breaking News

హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలు పాటించకుంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజారోగ్య దృష్ట్యా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పరిశుభ్రత, నాణ్యత పాటిస్తూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలోని వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారుల్లోని ఆహార విక్రయ కేంద్రాలు, వంటగదుల పరిశుభ్రతను ప్రజారోగ్య అధికారులు పరిశీలించారన్నారు. ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేని కేంద్రాలను గుర్తిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోటల్స్ యాజమాన్యాలు నిర్ణీత పరిశుభ్రత, ప్రజారోగ్య నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలతోపాటు, ట్రేడ్ లైసెన్స్ లు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. హోటళ్లలో వాడిన కప్పులు, గ్లాసులు, ప్లేట్లను కేవలం నీళ్లతో కడగడం వల్ల రోగక్రిములు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు మరుగుతున్న నీటిలో స్టెరిలైజేషన్ సెట్ ఉపయోగించి శుభ్రం చేయాలన్నారు. తాగునీటి పాత్రలపై మూతలు లేకపోవడం, పంపులు అమర్చక జగ్గులు ముంచడం వలన నీరు కలుషితమవుతుందని, తప్పనిసరిగా రక్షిత మంచినీటినే వాడాలని, పాత్రలపై మూతలు ఉంచి పంపులు అమర్చాలని ఆదేశించారు. తయారు చేసిన ఆహార పదార్థాలపై ఈగలు, దుమ్ము పడకుండా గ్లాస్ కేసుల్లో ఉంచాలని, స్టోరు గదిలో గోధుమ, మైదా, శనగపిండి, పంచదార వంటి ఆహార పదార్థాలపై మూతలు ఉంచుతూ, బొద్దింకలు, క్రిమికీటకాలు చేరకుండా అల్మరలకు మెష్ ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే, హోటల్ ఆవరణలోని గదులకు సున్నం వేయించాలని, పనిచేసే సిబ్బందికి అంటువ్యాధులు లేనట్లు గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వద్ద సర్టిఫికెట్ పొంది ఉండాలని, వారికి శుభ్రమైన డ్రెస్, ఆప్రాన్ అందజేయాలన్నారు. క్యాష్ కౌంటర్ సిబ్బంది హాజరు పట్టికను అందుబాటులో ఉంచాలని, అద్దె ఒప్పంద పత్రాల కాపీని ఇవ్వాలన్నారు.
పరిసరాల శుభ్రత, వ్యర్థాల నిర్వహణలో భాగంగా హోటళ్ల నుంచి వచ్చే మసి, చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్ బిన్లలో వేసి సేకరణ వాహనానికే ఇవ్వాలన్నారు. వంటగది, టాయిలెట్ల పరిశుభ్రత కోసం టైల్స్ అమర్చాలని, వంటగది నుంచి వచ్చే ఆయిల్, అన్నం, కూరగాయల వ్యర్థ పదార్థాలు నేరుగా కాలువలోకి పోకుండా మెష్ ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని ఆదేశించారు. ప్రజారోగ్య అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేసి నోటీసులు అందిస్తున్నారని, నోటీసు అందిన 7 రోజులలోగా పేర్కొన్న లోపాలను సవరించుకొని, నగరపాలక సంస్థకు తెలియజేయాలని, లేనిపక్షంలో చట్టప్రకారం ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు, అపరాధ రుసుం కూడా విధిస్తామని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *