– శిక్షణ పూర్తిచేసుకున్న ఏఐ 4 అష్యూర్ తొలి బ్యాచ్
– 31 మందిలో కొందరికి ఫుల్‌టైమ్ ఉద్యోగ అవకాశాలు
– మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ ఉపాధి
– సత్తా చాటిన మన స్వయం సహాయక సంఘాల మహిళలు
– సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లు అందజేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– ఆరెంజ్ ఎకానమీలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళల్లో దాగిఉన్న కళాత్మక ప్రతిభకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి, వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటుపల్లిలోని రైజ్ కేంద్రంలో ఏఐ 4 అష్యూర్ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. దీనిద్వారా తొలి విడతగా 31 మంది విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ4 స్ఫూర్తితో మార్గదర్శిగా ముందుకొచ్చిన సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈవో కెంబూరు సతీష్ కుమార్ సహకారంతో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న 31 మందికి మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఆన్‌లైన్ విధానంతో పాటు హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళల్లో నలుగురికి సినిమాటిక్ ఏఐ విభాగంలో హైదరాబాద్‌లో ఫుల్‌టైమ్ ఉద్యోగాలు లభించగా మిగిలిన వారికి ఫ్రీలాన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఏఐ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో మహిళలు సాధిస్తున్న పురోగతిని కలెక్టర్ అభినందిస్తూ, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా మహిళల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రైజ్ ద్వారా నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఏఐ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఇమేజ్ జనరేషన్, ఏఐ వీడియో క్రియేషన్, ఏఐ వాయిస్ అండ్ ఆడియో, సోషల్ మీడియా మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తదితర నైపుణ్యాలను శిక్షణలో నేర్పించడం జరిగిందన్నారు. ఓ అంచనా ప్రకారం ఇలాంటి నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించి లక్షలాది ఖాళీలు ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని అందిపుచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలన్నారు. సృజనాత్మకత, ఆలోచనలు, నైపుణ్యాలు, కళలు, డిజిటల్ కంటెంట్ ద్వారా ఆర్థిక విలువను సృష్టించే ఆరెంజ్ ఎకానమీలో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1గా నిలిపేందుకు చేస్తున్న కృషిలో భాగంగా రైజ్ కేంద్రం ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ ల్యాబ్‌ను కూడా అందుబాటులో ఉంచామని.. దీన్ని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా సమష్టిగా అడుగులు వేస్తున్నామని.. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యుల దిశానిర్దేశానికి అనుగుణంగా చొరవ చూపుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇంతమంచి కార్యక్రమంలో భాగస్వాములైన సింటిల్లా డిజిటల్ అకాడమీ సతీష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆశల ఉషోదయానికి సరైన వేదిక రైజ్: కె.సతీష్ కుమార్, సింటిల్లా డిజిటల్ అకాడమీ
గ్రామీణ మహిళల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, ఆలోచనలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి, వాటిని ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు రైజ్ ఎంతగానో దోహదపడుతోందని సింటిల్లా సీఈవో కె.సతీష్ కుమార్ అన్నారు. జీవితంలో ఆశలు ఉదయించడానికి.. వాటిని నెరవేర్చుకునేందుకు ఇది వీలుకల్పిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక చొరవ, నిబద్ధత కార్యక్రమం విజయవంతానికి ముఖ్యకారణమన్నారు. ముఖ్యంగా గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏఐ, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, బ్రాండింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజైన్, వీడియో ప్రొడక్షన్ వంటి నైపుణ్యాల్లో శిక్షణ అందించడం ద్వారా వారి ఆలోచనలకు కొత్త రూపం, వారి ఉత్పత్తులకు కొత్త మార్కెట్, వారి జీవితాలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News