Breaking News

జెన్ Z ఉద్యోగులను సమర్థవంతంగా నిర్వహించేందుకు నాయకత్వ విధానాల్లో మార్పు అవసరం

-మానవ వనరుల అభివృద్ది శిక్షణా కేంద్రం హెడ్ & IIM రోహ్‌తక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత తరం యువత, ముఖ్యంగా జెన్ Z ఉద్యోగులు, ఉద్యోగాన్ని కేవలం ఉపాధి లేదా ఉద్యోగ భద్రతగా కాకుండా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి ఒక అవకాశంగా చూస్తున్నారని మానవ వనరుల అభివృద్ది శిక్షణా కేంద్రం హెడ్ & IIM రోహ్‌తక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ పేర్కొన్నారు. జెన్ Z వర్క్‌ఫోర్స్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంస్థల నాయకత్వం సంప్రదాయ విధానాలకు పరిమితం కాకుండా కొత్త తరహా పని సంస్కృతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో ‘Leadership Challenges: Managing the Gen Z Workforce’ అంశంపై ఆయన మాట్లాడుతూ, 1997–2013 మధ్య జన్మించిన జెన్ Z తరం డిజిటల్ ప్రపంచంలో పెరిగిందని, నిరంతరం సమాచారాన్ని పొందే అవకాశం ఉండటంతో నిర్ణయాల వెనుక కారణాలను తెలుసుకోవడం, పారదర్శకతను ఆశించడం, తరచుగా ఫీడ్‌బ్యాక్ పొందడం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

సమాచారం అందుబాటులో లేని కాలంలో ఏర్పడిన పాత తరహా అధికార వ్యవస్థతో పోలిస్తే, ప్రస్తుత యువతకు సమాచారం క్షణాల్లో అందుబాటులో ఉందన్నారు. అందువల్ల ‘ఎందుకు?’ అనే ప్రశ్నకు సమాధానం లేకుండా కేవలం ‘ఏం చేయాలి?’ అని ఆదేశించడం ద్వారా నాయకత్వం కొనసాగించడం కష్టమవుతోందని వివరించారు.

జెన్ Z ఉద్యోగులు తమ పనిలో స్వయం నిర్ణయాధికారం, నైపుణ్యాభివృద్ధి, పని యొక్క ప్రయోజనంపై స్పష్టత కోరుకుంటున్నారని ప్రొఫెసర్ ధీరజ్ శర్మ తెలిపారు. పని చేసే విధానంపై నిర్దిష్ట పరిమితుల్లో కొంత స్వేచ్ఛ ఇవ్వడం, నిరంతర శిక్షణ మరియు ఫీడ్‌బ్యాక్ అందించడం, తాము చేస్తున్న పని ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని వివరించడం ద్వారా ఉద్యోగుల్లో బాధ్యత మరియు స్వచ్ఛంద నిబద్ధతను పెంచవచ్చన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో యువత ప్రధానంగా వేగవంతమైన నియామక ప్రక్రియ, పారదర్శకత, నిష్పాక్షికత, సకాలంలో ఫిర్యాదుల పరిష్కారం కోరుకుంటోందన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఖాళీల భర్తీ వంటి అంశాల్లో స్పష్టమైన కాలపట్టిక ఉండాలని, అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే ఫిర్యాదు లేదా వినతిని స్వీకరించిన తేదీ, దానిపై చర్య తీసుకునే బాధ్యత కలిగిన అధికారి, పరిష్కార స్థితి వంటి అంశాలను స్పష్టంగా తెలియజేయడం ద్వారా వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచవచ్చన్నారు.

ఉద్యోగి–సంస్థ సంబంధం కేవలం నియామక ఉత్తర్వులు, నిబంధనలతో మాత్రమే నిర్ణయించబడదని, సంస్థపై ఉద్యోగికి ఏర్పడే ‘Psychological Contract’ కూడా ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. ఉద్యోగంలో చేరే సమయంలో ఏర్పడిన అంచనాలు నెరవేరకపోతే ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం తగ్గే అవకాశం ఉందన్నారు. ఫలితంగా అదనపు కృషి, సంస్థ పట్ల స్వచ్ఛంద నిబద్ధత తగ్గడం, ఉద్యోగ మార్పు ఆలోచన పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సీనియారిటీ మాత్రమే నాయకత్వానికి ఆధారం కాకూడదని, సామర్థ్యం, నైపుణ్యం, పనితీరు, విశ్వసనీయత కూడా నాయకత్వానికి కీలక ప్రమాణాలుగా మారుతున్నాయని ప్రొఫెసర్ ధీరజ్ శర్మ పేర్కొన్నారు. ఉద్యోగులు తమ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని, సమర్థవంతమైన అంతర్గత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అంతర్గతంగా సమస్యలను వ్యక్తం చేసే మార్గాలు అందుబాటులో లేకపోయినా లేదా స్పందన ఆలస్యమైనా, ఉద్యోగులు తమ సమస్యలను ఇతర వేదికల ద్వారా వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో యువత చేపడుతున్న వివిధ నిరసనలు, సైకిల్ యాత్రలు వంటి కార్యక్రమాలను కూడా ఈ నేపథ్యంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి కేవలం ఆందోళనలుగా కాకుండా, తమ సమస్యలకు స్పందన కోరుతూ యువత వినియోగిస్తున్న ప్రత్యామ్నాయ వేదికలుగా కూడా పరిగణించాల్సి ఉంటుందని వివరించారు.

భవిష్యత్ జెన్ Z వర్క్‌ఫోర్స్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు నాయకత్వం ఆదేశాల నుంచి సంభాషణ వైపు, ఆలస్యమైన స్పందన నుంచి సకాలంలో స్పందన వైపు, కఠినమైన నియంత్రణ నుంచి బాధ్యతతో కూడిన స్వేచ్ఛ వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఉద్యోగికి తన బాధ్యతలు, లక్ష్యాలపై స్పష్టత కల్పించడం, నిరంతర ఫీడ్‌బ్యాక్ అందించడం, అభివృద్ధికి అవకాశాలు కల్పించడం, సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా సంస్థలపై యువతలో నమ్మకాన్ని పెంచవచ్చన్నారు.

జెన్ Zను నిర్వహించడం అంటే కేవలం కొత్త తరానికి నాయకత్వం వహించడం కాదు; నమ్మకం, పారదర్శకత, వేగవంతమైన స్పందన, అభివృద్ధి అవకాశాలు, బాధ్యతతో కూడిన స్వేచ్ఛ కలిగిన కొత్త పని సంస్కృతిని నిర్మించడం అని ప్రొఫెసర్ ధీరజ్ శర్మ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *