-అందుబాటులోనికి రానున్న 175 పడకలు
-ప్రస్తుతం 21 కేంద్రాలు.. 340 పడకలు
-రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు (ఎన్‌ఆర్‌సీలు) ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఎనిమిది 10 పడకల ఎన్‌ఆర్‌సీలు, ఏడు 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్‌ఆర్‌సీలు, మరో ఆరు 10 పడకల కొత్త కేంద్రాలు దశలవారీగా వినియోగంలోకి రానున్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో వెల్లడించారు.
అరకుతో మొదలు.. నరసరావుపేట వరకు
ఇంతకు ముందు మంజూరైన ఎనిమిది 10 పడకల కేంద్రాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, ముంచింగిపుట్, చింతపల్లి, అనకాపల్లి, బాపట్ల, నంద్యాల, సున్నిపెంట; పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో రానున్నాయి. ఒక్కో కేంద్రంలో 10 పడకలు చొప్పున మొత్తం 80 పడకలు అందుబాటులోకొస్తాయి. వీటిలో అరకు, నంద్యాల కేంద్రాల్లో పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలో ఇవి వినియోగంలోకొస్తాయి. ముంచింగిపుట్‌లో సివిల్ పనులకు టెండర్ ప్రక్రియలో ఉంది. చింతపల్లిలో కొత్త భవనం నిర్మాణంలో ఉంది. అనకాపల్లిలో పనులు జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం 7 ఇంటిగ్రేటెడ్ ఎన్‌ఆర్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాంతంలోని అడ్డతీగల, వై.రామవరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పాలకొండ, బద్రగిరి, కురుపాం, చినమేరంగిలో ఇవి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో ఐదు పడకలు చొప్పున మొత్తం 35 పడకలు ఉంటాయి. అడ్డతీగల, వై.రామవరం కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గర్లోనే చికిత్స అందుతుంది.
మరో ఆరు కేంద్రాల మంజూరు
పైవాటికి అదనంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు 10 పడకల ఎన్‌ఆర్‌సీలను ప్రభుత్వం మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 10 పడకలు చొప్పున మరో 60 పడకలు అందుబాటులోకొస్తాయి. 10 పడకల ఎన్‌ఆర్‌సీకి ఒక వైద్యాధికారి, ఒక పోషకాహార సలహాదారు, ఒక స్టాఫ్ నర్స్, ఒక వంట/సంరక్షణ సిబ్బంది, ఒక క్లీనర్ కమ్ అటెండర్‌ను మంజూరు చేశారు. 20 పడకల కేంద్రానికి ఇద్దరు వైద్యాధికారులు, ఇద్దరు పోషకాహార సలహాదారులు, ఇతర సిబ్బంది ఉంటారు.
నిధుల కేటాయింపు
ఎన్‌ఆర్‌సీలకు 2026-27లో మౌలిక వసతులు, సిబ్బంది సామర్థ్యం పెంపు, ఆశా కార్యకర్తల ప్రోత్సాహకాలు, నిర్వహణ ఖర్చుల కోసం మొత్తం రూ.4.42 కోట్లు కేటాయించారు. 2024-25లో రూ.3.75 కోట్లు, 2025-26లో రూ.3.56 కోట్లు కేటాయించారు. మానవ వనరుల కోసం ఏడాదికి రూ.12.22 కోట్లు మంజూరు చేశారు.
99 శాతం కేసుల విజయవంతం
ఐదేళ్లలోపు తీవ్ర పోషకాహార లోపం (ఎస్‌ఏఎం)తో పాటు వైద్య సమస్యలు ఉన్న చిన్నారులకు ఎన్‌ఆర్‌సీల్లో ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న పిల్లల్లో అత్యధికులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. 2024-25లో 5,961 మంది చిన్నారులు చేరగా.. 5,878 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరి శాతం 98.60గా ఉంది. 2025-26లో 6,195 మంది చేరగా.. 6,168 మంది కోలుకున్నారు. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,492 మంది చేరగా.. 2,462 మంది కోలుకున్నారు. ఈ కాలంలో 98.80 శాతంగా నమోదైంది.
Prajavartha Online Telugu News