-జిల్లా కలెక్టర్లు దీనిపై దృష్టి సారించాలి
-ప్రతి జిల్లాకు ప్రత్యేక అవకాశాలుంటాయి
-వాటిని గుర్తించి ఆ దిశగా జిల్లాను ఆదాయ మార్గాలు పెంచాలి
-వృద్ధిరేటుపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల ప్రగతి చిత్రమే రాష్ట్ర వృద్ధి పరుగుకు ఊతమిస్తుందని, జిల్లా కలెక్టర్లు ప్రతి నెలా స్థూల విలువ జోడింపులో తాము ఏ దశలో ఉన్నామో తెలుసుకుని ముందుకు వెళ్లడానికి కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సూచించారు. సచివాలయంలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో ఆయన రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై పవర్ పాయింటు ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాల అభివృద్ధికి విజన్ ప్రేమ్ వర్క్ రూపొందించి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఆయా జిల్లాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మదింపు వేస్తున్నామన్నారు. మండల స్థాయిలో కూడా ఆర్థిక ప్రగతిని మదింపు వేస్తున్నామని, ఆయా జిల్లాలు స్థూల విలువ జోడింపు (జీఏవీ)లో ఏ ర్యాంకులో ఉన్నామనేది తెలుసుకుని, ఎక్కడెక్కడ వెనకబడ్డామో ఆయా రంగాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. మనం పనిచేస్తున్నాం కానీ ఎంతమాత్రం ఫలితాలు సాధిస్తున్నామనేది ముఖ్యంగా పరిశీలించాలన్నారు. ఒక జిల్లాను మరో జిల్లాతో పోల్చలేమని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అవకాశాలుంటాయని, ఆయా రంగాల్లో ఆదాయార్జన పాటుపడాలన్నారు. జిల్లాలో జరిగే వస్తు, వ్యవసాయోత్పత్తులకు మార్కెట్లో మంచి ధర లభించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏ మండలం బలం ఏంటీ, దానికున్న ప్రధాన ఆర్థిక బలాలేంటీ, ఆ మండలం ఎందుకు వెనుకబడింది అనేది సమీక్షించుకుని ఆయా మండలాల్లు ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాగా రాణించిన జిల్లాలను ఆదర్శంగా తీసుకుని వెనుకబడిన జిల్లాలు ముందుకు వెళ్లాలన్నారు. డేటా ఆధారంగా తమ జిల్లాకు దశను, దిశను కలెక్టర్లు నిర్దేశించుకోవాలని సూచించారు.
Prajavartha Online Telugu News