-దేశానికే ప్రధాన పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోంది:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
-ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
-ఏపీని విజిట్ చేయండి.. భారతదేశ వైవిధ్యాన్ని అనుభూతి చెందండి: టూర్ ఆపరేటర్లకు మంత్రి దుర్గేష్ పిలుపు
-గోదావరి పుష్కరాల కోసం 7 ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ల రూపకల్పన..కుంభమేళా రేంజ్‌లో పుష్కరాల ఘనతను ప్రపంచానికి చాటేందుకు ప్రణాళికలు: మంత్రి కందుల దుర్గేష్
-పాలసీ నుంచి ప్రమోషన్ వరకు… ఏపీ టూరిజంలో ఆరంచెల విధానం.. ప్రసాద్, స్వదేశీ దర్శన్, శాస్కి, సీబీడీడీ పథకాలతో ఏపీలో పర్యాటక ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయన్న మంత్రి కందుల దుర్గేష్
-టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన పిల్లర్లుగా అభివర్ణించిన మంత్రి దుర్గేష్
-సరైన సమయంలో సరైన శాఖ సరైన వ్యక్తి చేతిలో పెట్టారంటూ మంత్రి కందుల దుర్గేష్ ను కొనియాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ పర్యాటక చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత కీలకమైన, ప్రధానమైన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
భారతదేశంలో ఇన్ బౌండ్ టూరిజం వృద్ధిని మరింత వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా, “ఇండియా – ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ” థీమ్ తో గురువారం సాయంత్రం విశాఖపట్నంలోని ‘నోవాటెల్’ హోటల్ వేదికగా 41వ ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్’ (IATO) వార్షిక సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సు ప్రారంభ సూచికగా ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ మాన్యువల్ బుక్’ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం కుంభమేళా తరహాలో ఆధ్యాత్మికత, సంస్కృతి, వారసత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో ఏపీ పర్యాటక శాఖ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘ది గోదావరి కాల్స్’ పోస్టర్‌ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అందులో 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల విశిష్టతను, పర్యాటక సర్క్యూట్ ల వివరాలున్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. పర్యాటకులు కేవలం ఒక రాష్ట్రాన్ని సందర్శించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక పర్యాటక అనుభవాల ద్వారా భారతదేశ సమగ్ర సంస్కృతిని అనుభూతి చెందుతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి విచ్చేసిన పర్యాటక ప్రతినిధులు, టూర్ ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించి, ఇక్కడి సంస్కృతి, అతిథ్యంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పర్యాటక అవకాశాలను స్వయంగా తెలుసుకొని, ఏపీ పర్యాటకాన్ని ప్రపంచ వేదికపై ప్రచారం చేయడానికి భాగస్వాములు కావాలని కోరారు.ఈ సందర్భంగా 2, 3, 4, మరియు 7 రోజుల ప్రత్యేక ఏపీ పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలని కోరారు. ప్రసంగంలో తన భాషాభిమానాన్ని చాటుకుంటూ “దేశభాషలందు తెలుగు లెస్స” అని స్మరించుకున్న మంత్రి దుర్గేష్ ఏపీ పర్యాటక ప్రతినిధులకు ఐఏటీఓ నమోదులో ఉచిత రిజిస్ట్రేషన్ కల్పించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిందని, నూతన పర్యాటక పాలసీ (2024-29) ద్వారా పెట్టుబడిదారులకు భారీ రాయితీలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేగాక క్యారవాన్, హోమ్ స్టే, ల్యాండ్ అలాట్ మెంట్, ఎంప్లాయిమెంట్ జనరేషన్ తదితర అనుబంధ పాలసీలతో గడిచిన రెండేళ్లలోనే రాష్ట్రానికి రూ. 20,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. పర్యాటకాభివృద్ధిని పాలసీ, ప్రాసెస్, పార్ట్‌నర్‌షిప్, ప్రాజెక్ట్స్, ప్రమోషన్, ప్రొడక్ట్స్ అనే ఆరు ప్రాథమిక సూత్రాల ఆధారంగా పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య పర్యాటక రంగం నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెల్‌నెస్, ఎకో, అడ్వెంచర్, హెలీ, సీప్లేన్ టూరిజం వంటి వినూత్న పద్ధతులను వేగవంతం చేశామని తెలిపారు. 1058 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్రతీరంలో యోగా, ఆయుర్వేద ఆధారిత ‘వెల్‌నెస్ టూరిజం’ను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. అరకు, లంబసింగి, మారేడుమిల్లి వంటి అందమైన పర్యాటక ప్రాంతాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టి కలిగిన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటకరంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, స్థానిక ఉపాధి కల్పనకు ప్రధాన ‘గ్రోత్ ఇంజిన్’గా మారుస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రసాద్, శాస్కి, సీబీడీడీ , స్వదేశీ దర్శన్ పథకాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలను ఆధునీకరిస్తూ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలు పర్యాటక రంగానికి గొప్ప ఊతాన్నిచ్చాయని వెల్లడించారు.
గోదావరి తీరంలో 7 ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లు:
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించేలా ఏపీ పర్యాటక శాఖ గోదావరి పరివాహక ప్రాంతాల్లో 7 పర్యాటక సర్క్యూట్లను రూపొందించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు.అందులో పంచారామ క్షేత్రాలు, శక్తిపీఠాలు, దేవీ క్షేత్రాలు, వైష్ణవ దివ్య క్షేత్రాలు, గోదావరి హెరిటేజ్ టెంపుల్స్, పుష్కర్ ఘాట్స్, అఖండ గోదావరి ప్రాంతాలుంటాయని వెల్లడించారు. చారిత్రక హేవలాక్ వంతెన, పాపికొండల పడవ ప్రయాణం, పుష్కర్ ఘాట్లు, హారతి కార్యక్రమాలు, అంతర్వేది, వాడపల్లి, అప్పనపల్లి, మందపల్లి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు తదితర క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించామన్నారు.
ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చే ప్రతి పర్యాటకుడు ఆనందంతో పాటు జీవితాంతం పదిలంగా దాచుకునే మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకుంటారని మంత్రి దుర్గేష్ ఘంటాపథంగా చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యుత్తమ సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని, ఈ వృద్ధిలో టూర్, ట్రేడ్ ఆపరేటర్ల క్రియాశీల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు.”ప్రచారం నుంచి వ్యాపారం… పర్యాటకం నుంచి స్థానిక ఆర్థికాభివృద్ధి” అనే స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తున్నామని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అనుభవాలను అత్యంత సులభంగా ప్యాకేజ్ చేయడానికి, బుక్ చేయడానికి, అనుభూతి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుగా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.రాష్ట్రానికి విచ్చేసే పర్యాటకుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని, బాధ్యతాయుత పర్యాటక విధానాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన టూర్ ఆపరేటర్లను ప్రత్యేకంగా అభినందించారు. టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన స్తంభాలు అని మంత్రి కొనియాడారు.
సరైన వ్యక్తి చేతిలో పర్యాటక శాఖ – మంత్రి దుర్గేష్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సరైన సమయంలో అత్యంత సమర్థుడైన, సరైన వ్యక్తి చేతిలో ఉందంటూ రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా కొనియాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలతో చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..ఏపీని ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని రకాల ప్రకృతి, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో దాగి ఉన్నాయని వెల్లడించారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భవిష్యత్తంతా పర్యాటక రంగానిదేనని బలంగా విశ్వసిస్తున్నారని, అందుకే ఈ రంగానికి ప్రత్యేక శ్రద్ధతో ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.రాష్ట్రానికి ఇప్పటికే మెరుగైన అనుసంధానం ఉందన్న కేంద్ర మంత్రి, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యాటకుల ప్రయాణాలను మరింత వేగవంతం, సులభతరం చేస్తామని ప్రకటించారు.
పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పర్యాటక వనరులు, ప్రగతి, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మౌలిక వసతుల కల్పనపై గణాంకాలతో కూడిన సమగ్ర నివేదికను సదస్సులో వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పర్యాటక పాలసీ 2024-29 ఇన్వెస్టర్లకు, టూర్ ఆపరేటర్లకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ఐఏటీఓ ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీలోని సుందర తీరప్రాంతాలు, అరకు, పాపికొండలు,గోదావరి పుష్కరాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించి విదేశీ, స్వదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ఐఏటీఓ ప్రతినిధులను, టూర్ ఆపరేటర్లను పర్యాటక శాఖ అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏపీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విచ్చేసిన అతిథులను విశేషంగా అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ టీడీసీ ఛైర్మన్ నీలూ శర్మ,పర్యాటక,సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పట్టాన్ శెట్టి రవి సుభాష్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ విద్యాధరి, ఐఏటీఓ ప్రెసిడెంట్ రవి గోసేన్, ఛైర్మన్ సునీల్ మిశ్రా, ప్రతినిధులు రాజ్ నిష్ కైస్తా, సంజయ్ రాజ్దాన్, దీపక్ కుమార్ భట్నాగర్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది మంది టూర్ ఆపరేటర్లు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News