-వేసవి స్థాయిలో వినియోగం.. ముందస్తు కొనుగోళ్లకు ఆదేశం
-ప్రజలకు విద్యుత్ కొరత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
-మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందుగానే విద్యుత్‌ను కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అవసరమైన విద్యుత్‌ను ముందస్తుగా సమకూర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. డిమాండ్ పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా సరఫరా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు రాకూడదు
విద్యుత్ కొరత కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ లోటు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిస్కంలు, విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News