అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) కార్యాలయం & అధికారుల నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ LIC, APCRDA మధ్య ఒప్పందం పూర్తయ్యింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలను APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్(మచిలీపట్నం) నున్నా నాగేశ్వరరావు గారికి శుక్రవారం, 2026 సెప్టెంబర్ 11న అందజేశారు.
రాజధాని అమరావతిలోని LIC తన ప్రాంతీయ కార్యాలయాన్ని, అధికారుల నివాస గృహాలను ఉద్దండరాయునిపాలెంలోని 0.4 ఎకరాలలో నిర్మించనుండగా.. నిర్మాణ పనులకు గౌరవ కేంద్రమంత్రివర్యులు నిర్మల సీతారామన్ గారు గత ఏడు నవంబర్‌లో శంకుస్థాపన చేసియున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా LIC రూ.22 కోట్లు పెట్టుబడి పెట్టి అమరావతిలో 1,250కి పైగా ఉద్యోగాలను కల్పించనుంది. సుమారు 11,000 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కానుంది. ఈ నిర్మాణ పనులన్నింటినీ రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని LIC అధికారులు పేర్కొన్నారు. ప్రజారాజధాని అమరావతిని జాతీయ స్థాయిలో ఆర్థిక & పరిపాలనా కేంద్రంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే కార్యాచరణలో భాగంగా ఈ రోజు కీలకమైన ముందడుగు పడింది.
Prajavartha Online Telugu News