-ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం
-సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అందజేస్తాం – MLA బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రతి శుక్రవారం నిర్వహించు ప్రజా దర్బార్ ( PGRS ) నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నేరుగా ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదు, ప్రతి అర్జీపై జవాబుదారీతనంతో స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, ఏదైనా కారణంతో ఆలస్యం అయితే అందుకు గల కారణాలను కూడా ప్రజలకు వివరిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని, పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పాటు వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు, మంచానికే పరిమితమైన వారికి రూ.10 వేలు, తలసేమియా బాధితులకు నెలకు రూ.15 వేలు అందిస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని, సంక్షేమంతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు రూ.650 కోట్ల మేర నిధులు ఖర్చు చేశామని బొండా ఉమ తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని, ఈ గుర్తింపు తనకు మాత్రమే కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ దక్కిన గౌరవమన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పెన్షన్ల సమస్యలను తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడంతో కొత్త పెన్షన్ల ప్రక్రియ వేగవంతమైందని బొండా ఉమ తెలిపారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు సచివాలయానికి వెళ్లి KYC, వేలిముద్ర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. కొత్త పెన్షన్ అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, కార్యాలయంలోని సిబ్బంది వారికి పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు.
త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి విచ్చేసి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారని . నియోజకవర్గంలోని అరుణోదయ నగర్, సుబ్బరాజు నగర్, దేవినేని గాంధీనగర్, ఇందిరా కాలనీ, నర్సరాజు రోడ్, తుంగం రాములు , వీధి, గిరిపురం, కస్తూరిబా పేట, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు.
సుమారు 25 వేల మంది పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను పూర్తి చేస్తున్నామని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పేదలకు వారి స్థలాలపై శాశ్వత హక్కు కల్పించనున్నామని, ఇకపై పట్టాల కోసం MRO కార్యాలయం చుట్టూ, ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపించడమే తమ లక్ష్యమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం NDA కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News