-ఎమ్ ఓ లు సోమవారం నాటికి నమోదు, సంబంధిత డాక్టర్ల బయో మెట్రిక్ నమోదు పూర్తి చెయ్యాలి
-ఆరోగ్యద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడానికి అవకాశం ఉంది
-ఏ ఎన్ ఎం ల నుంచి సరైన అభిప్రాయ సేకరణ చెయ్యడం లేదు
-కొన్ని ఆసుపత్రులలో కనీసం ఒక్క డెలివరీ కేసు చూసిన దాఖలాలు లేవు
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులు, సి హెచ్ సి లు, పి హెచ్ సి లు ద్వారా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 50 శాతం మేర విస్తరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఆరోగ్యశ్రీ సేవలు అమలు తీరుపై మెడికల్ ఆఫీసర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందచేసే వైద్య విధానం ద్వారా ప్రభుత్వ ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఆప్రక్రియలో భాగంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన మెడికల్ ఆఫీసర్స్ మెరుగైన పనితీరు చూపాల్సిన కనీస బాధ్యత ఉండాలని స్పష్టం చేశారు. కొందరు మెడికల్ ఆఫీసర్స్ పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుండడం అభినందనీయం అని అన్నారు. అయినప్పటికీ ప్రవేటు ఆసుపత్రులతో పోల్చితే ప్రభుత్వ వైద్యుల పనితీరు సంతృప్తికరంగా లేదని తెలిపారు.వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో జిల్లాలోని అన్ని వివిధ స్థాయి లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ఖచ్చితంగా ఎంప్యానెల్‌మెంట్ చేసుకోవాలని మాధవీలత స్పష్టం చేశారు. ఆయా ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యాధికారులు పేర్లు నమోదు చేసుకోవడం
బయో మెట్రిక్ ప్రక్రియ సోమవారం నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచు కావాలన్నారు. నార్మల్ డెలివరీ చేపట్టాలని, వాటికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇండెంట్ అందచేయాలని ఆదేశించారు. అనపర్తి ఏరియా ఆసుపత్రి గత నెలలో 22 గర్భిణి కేసులు ఉండగా ఈ నెలలో 69 కేసులు, కొవ్వూరు లో 58 నుంచి 100 వరకు ప్రగతి చూపారని, కానీ ఇంకా పెంచాల్సి ఉంటుందన్నారు. కడియం , మలకపల్లి, దొమ్మెరు , ఉండ్రాజవరం, అన్నదేవర పేట, తదితర 13 ఆసుపత్రులలో ఒక్క డెలివరీ కేసు నమోదు కాకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఆయా ఆసుపత్రులు నమోదు తో పాటు వైద్య అధికారులు కూడా వారి పేర్లు నమోదు పూర్తి చెయ్యాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం నాటికి సంపూర్ణ నివేదిక అందచేయాలని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో నమోదు చేసే ప్రక్రియను ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ సమగ్రంగా అవగాహన కల్పిస్తారని మాధవీలత పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించే సామర్థ్యం మేరకు నాడు నేడు ద్వారా మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి పరచడం జరిగిందని అన్నారు. ఆరోగ్య మిత్రాలను నెట్ వర్క్ ఆసుపత్రులకు కేటాయించిన దృష్ట్యా, సి హెచ్ సి, పి హెచ్ సి లలో పనిచేసే స్టాఫ్ నర్స్ లు డేటా ఎంట్రీ పనులు కూడా నమోదు చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారులు డా ఎన్. వసుంధర, ఆరోగ్యశ్రీ కో ఆర్డి నేటర్ డా పి. ప్రియాంక, ఇంఛార్జి డిసిహెచ్ఎస్డా కే. సాయి కుమార్, డా. అభిషేక్, పీహెచ్ సి వైద్యులు, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News