విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులపై సుధీర్ఘంగా చర్చించారు. కొన్ని పనులకు రైల్వే బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందని.. మరికొన్ని పనులు పెండింగ్ లో ఉన్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగరంలోని జనాభా, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా పలు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. గుణదలలో రెండు, మధురానగర్ పప్పుల మిల్లు వద్ద, రాజరాజేశ్వరి పేట, వాంబే కాలనీలలో గతి శక్తి ప్రాజెక్టు కింద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్.ఓ.బి.) నిర్మాణాలను చేపట్టాలన్నారు. రామకృష్ణాపురం-దేవీనగర్ రైల్వే అండర్ పాస్ వద్ద జరుగుతున్న రహదారి నిర్మాణం, యూజీడీ, వాటర్ లైన్ పనులు నిలిచిపోవడతో రైల్వే అనుమతులు వెంటనే ఇవ్వవలసిందిగా కోరారు. జీవీఆర్ నగర్లో కొత్తగా వేసిన యూజీడీ లైన్లను.. అజిత్ సింగ్ నగర్లోని ఎస్టిపి(సూయజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కి అనుసంధానించేందుకు వీలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే అనుమతులను క్లియర్ చేయవలసిందిగా విన్నవించారు. అలాగే బసవతారక నగర్, రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వెంబడి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేయవలసిందిగా కోరడంతో.. డీఆర్ఎం సానుకూలంగా స్పందించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. సమీక్షలో చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకర్ రావు, ఎస్ఈ(ఇంజనీరింగ్) నరసింహమూర్తి, సిటీ ప్లానర్ ప్రసాద్, ఈఈ-2 వి.శ్రీనివాస్, ఈఈ-1 నారాయణ మూర్తి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News