-సైనికులు దేశాన్ని కాపాడితే…
-సఫాయి మిత్రలు గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు…
– మన ఇంటితో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుందాం…
– సఫాయి మిత్రలకు సహకరించండి
– తడి, పొడి చెత్తను వేరు చేయడం సులభమే…
– నున్న చెరువును అద్భుతంగా అభివృద్ధి చేస్తాం…
– పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటితోపాటు గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పాన్ని తీసుకొని గ్రామ సఫాయి మిత్రలకు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నున్న గ్రామంలోని చెరువు దగ్గర ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణలో సఫాయి, క్లాప్ మిత్రలు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. గ్రామాలకు వీరు అందిస్తున్న సేవల వల్లనే గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య జీవనం సాధ్యమైందన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత, కాలుష్య నివారణ వంటి అంశాలపై అవగాహన పెరగడం శుభ పరిణామమన్నారు. ఈ ఒక్కరోజు తాము ఈ కార్యక్రమంలో పాల్గొని చేసిన పని వల్ల ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పని ఎంత కష్టతరమైనదో తెలిసిందన్నారు. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో సైతం పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్నారు. దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల వలె పారిశుద్ధ్య కార్మికులు కూడా గ్రామాలను అంటు వ్యాధుల నుంచి కాపాడుతున్నారని ప్రశంసించారు. ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు గ్రామ ప్రజలు తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పమే మీ గ్రామాలను వ్యాధి రహిత గ్రామాలుగా మారుస్తుందన్నారు. నున్న పరిసర ప్రాంత ప్రజలకు తాగునీరు అందిస్తున్న చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు అందిస్తామన్నారు. అలాగే ఈ చెరువుల పరిసరాలలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉత్పత్తి అయ్యే తడి చెత్తను, కూరగాయలు వ్యర్ధాలను 12 గంటల లోపు సమయంలో మాత్రమే ఒక ప్రయోజనకరమైన కంపోస్టుగా మార్చేందుకు అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు కూరగాయల వ్యర్ధాలను పశువులకు ఆహారంగా వినియోగించాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని 303 పంచాయతీలు, 5 అర్బన్ ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని చెత్త, కాలుష్య రహిత ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ ప్రాంత ప్రజలు దీనిని నిరంతరం కొనసాగించాలన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని నినదించిన మహాత్మా గాంధీ వాక్కును ప్రతి ఒక్కరూ తమకు తాము అన్వయించుకుని తమ గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ ఆరోగ్యం కోసం నిరంతరం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కనిపించే దేవుళ్ళతో సమానమన్నారు. గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత విషయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నున్న గ్రామంలోని చెరువు చుట్టూ కొబ్బరి మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా గ్రామపంచాయతీ తీసుకోవాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా జిల్లా యంత్రాంగం అందిస్తుందన్నారు. వీటి ద్వారా గ్రామపంచాయతీకి ఒక ఆదాయ మార్గం కూడా ఏర్పడుతుందన్నారు. సఫాయి మిత్రలను సత్కరించడం అంటే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన వారిని గౌరవించడంతో సమానమని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతాననే నినాదంతో ”నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు గ్రామం పరిశుభ్రంగా ఉండటం కోసం కొంత సమయం కేటాయిస్తానని అందరికంటే ముందు తాము విధులు నిర్వహించే కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా భారతదేశం ఒక పరిశుభ్ర దేశంగా ఉంచుతుందని నమ్ముతున్నాను” అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బుడితి రాజశేఖర్, డిల్లీరావు లు కాఫీ విత్ క్లాత్ మిత్ర లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలసి టి సేవించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీ పీ వో జయచంద్ర గాంధీ, డ్వామా పీడీ జే సునీత, ఆర్ డబ్లూ ఎస్ ఇ ఇ ది.వెంకటరమణ, స్వచ్చాంద్ర కార్పొరేషన్ కోఆర్డినేటర్ ఊర్మిళ, విజయవాడ రూరల్ ఇంఛార్జి ఏంపిడిఓ శేషగిరిరావు ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, నున్న సర్పంచ్ కే సరళ, ఉప సర్పంచ్ కే బ్రహ్మానందంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి డి కే వెంకట రమణ సొసైటీ అధ్యక్షుడు పీ చంద్రా రెడ్డి, ఎంపిడిఓ బీఎల్వీ శేషగిరి రావు పంచాయితీ సిబ్బంది వివిధ శాఖల అధికారులు సిబ్బంది గ్రామస్థులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News