రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కే. ప్రత్యూష కుమారి వారు ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడారు.తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 గురించి వారికి వివరించారు. వారిని మానసికంగా, శారీరకంగా వేధించిన వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని తెలిపారు. వయోవృద్ధులు తమ ఆస్తిని పిల్లలు లేదా వారికి ప్రియమైన వారికి గిఫ్ట్ డీడ్ రూపంలో బదలీ చేసేటప్పుడు సదరు దస్తావేజులో (వారి పోషణ మరియు సంరక్షణ పట్టించుకోని పక్షంలో గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసే అధికారాన్ని పెట్టుకునే విధంగా) ఉపసంహరణ షరతును జోడించడం మంచిదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వయోవృద్ధులకు ఎలాంటి న్యాయ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. అనంతరం వృద్ధులకు రగ్గులు, దుస్తులు, చేతి కర్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. రామ్ కుమార్, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ స్థాపకులు జి. రాంబాబు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News