గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డ్ సచివాలయాల వారిగా అనారోగ్య సమస్యలు ఉన్న ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్షని సద్వినియోగం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను పరిశీలించిన కమిషనర్ స్వయంగా క్యాంప్ లో కళ్లు పరీక్ష చేయించుకొని, ప్రజలతో మాట్లాడి క్యాంప్ నిర్వహణపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష అనారోగ్య సమస్యలు ఉన్న వారికి గొప్ప అవకాశమని, ఎంతో ఖరీదైన వైద్యం, మందులు ఉచితంగా క్యాంప్ లో ఆడించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వార్డ్ సచివాలయం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సురక్ష క్యాంప్ పై అవగాహన కల్గించడం, అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. క్యాంప్ లో మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు, ప్రతి కౌంటర్ వద్ద సమాచారం కోసం వార్డ్ సచివాలయ కార్యదర్శిని నియంమిచడం, త్రాగునీరు, మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. మందులు ఇచ్చేందుకు కూడా తగిన కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి కూడా నేరుగా క్యాంప్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి తగిన వైద్య పరీక్షలు చేస్తున్నారని, ఎవరికైనా ఉన్నత వైద్యం అవసరమైతే ప్రభుత్వ లేదా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. క్యాంప్ లో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ తో పాటుగా ఇద్దరు ఎంబిబిఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. క్యాంప్ ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని, క్యాంప్ లో డిప్యూటీ కమిషనర్లు, ఎంహెచ్ఓ, ప్రజారోగ్య అధికారులు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య ఎదురైనా వారిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అనంతరం క్యాంప్ లోని కళ్ల విభాగంలో కళ్ళు పరీక్ష చేయించుకొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ. కొండారెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రత్న మన్మోహన్ కార్పొరేటర్ శ్యామల వెంకటరమణ దేవి, మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News