Breaking News

2023 వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు– ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన

-వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డులు 23
-వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డులు 4
-నవంబరు 1వతేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అవార్డుల బహూకరణ
-ప్రభుత్వ సలహాదారు(కమ్యునికేషన్స్)జివిడి కృష్ణమోహన్.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరసగా మూడో ఏడాది వివిధ రంగాల నుండి లబ్ద ప్రతిష్ఠుల్ని ఎంపిక చేసి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2023 వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డులు-ఎచీవ్మెంట్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు(కమ్యునికేషన్స్)జివిడి కృష్ణ మోహన్, సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ 2023 వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు,వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డులను ప్రకటించారు.ఈసందర్భంగా ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని ముఖ్యంగా సామాన్యుల్లో అసామాన్యులకు మరియు పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్ర వేసిన వారిని గుర్తించి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.ఈఅవార్డుల ఎంపికకు ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్) జి.వి.డి.కృష్ణమోహన్‌,జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ లతోపాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు,సమాచారశాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి,వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిపారు. ఆమేరకు తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు,సంస్థలను,జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను ఈకమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ ఎంపిక చేయటం జరిగిందని సలహాదారు కృష్ణమోహన్ స్పష్టం చేశారు.ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు.ఈఅవార్డులను నవంబరు 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు బహుకరించడం జరుగు తుందని తెలిపారు.ఈఅవార్డు కింద ఎంత నగదు పురస్కారం ఇస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సలహాదారు కృష్ణమోహన్ సమాధానం ఇస్తూ ఇక్కడ డబ్బు ప్రధానం కాదని వారు చేసిన సేవలకు తగిన గౌరవం కల్పించడం ముఖ్యమని పేర్కొంటూ వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతలకు రూ.10 లక్షల నగదు పురస్కారంతో పాటు వైయస్సార్ కాంస్య ప్రతిమ,జ్ఞాపిక,ప్రశంసాపత్రం అందజేస్తారన్నారు.అదే విధంగా వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.5 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందజేస్తారని వివరించారు.
తొలుత రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ సామాన్యుల్లో అసామాన్యులు మరియు పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్ర వేసిన వారిని ఎంపిక చేసి ఈవైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, వైయస్సార్ ఎచీవ్మెంట్ అవార్డులు అందించండం జరుగుతోందన్నారు.
ఈమీడియా సమావేశంలో రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ 2023 వైయస్సార్‌ అవార్డులు కింద మొత్తం 27 అవార్డులను ప్రకటించగా వాటిలో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు,4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఉన్నాయి.ఆవివరాలు జిల్లాల వారీగా ఈకింది విధంగా ఉన్నాయి.
వ్యవసాయం:
1)  పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2) వై.వి.మల్లారెడ్డి– అనంతపురం
ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:
1) యడ్ల గోపాలరావు– రంగస్థల కళాకారుడు– శ్రీకాకుళం
2)  తలిసెట్టి మోహన్‌– కలంకారీ– తిరుపతి
3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4)  కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ– కాకినాడ
6) ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా
7)  రావు బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు
8) తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9) చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10)  కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం
తెలుగు భాష– సాహిత్యం:
1) ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2)  ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3)  మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం
క్రీడలు:
1)  పుల్లెల గోపీచంద్‌– గుంటూరు
2)  కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం
వైద్యం:
1)  ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌
మీడియా:
1)  గోవిందరాజు చక్రధర్‌– కృష్ణా
2)  హెచ్చార్కే– కర్నూలు
సమాజ సేవ:
1) బెజవాడ విల్సన్‌– ఎన్టీఆర్‌
2)  శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ– (ఎచీవ్‌మెంట్‌)
3) నిర్మల హృదయ్‌ భవన్‌– ఎన్టీఆర్‌
4) జి. సమరం– ఎన్టీఆర్‌

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *