గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగునీటి సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కల్గితే ఉపేక్షించబోమని, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో త్రాగునీటి సరఫరాను పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నగరంలో త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ల మరమత్తులపై ఎస్ఈ, ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా రిజర్వాయర్ల వారిగా ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఎక్కడా ప్రజలకు త్రాగునీటి సరఫరాలో కలుషిత నీరు సరఫరా వంటి సమస్యలు తలెత్తకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో ఎస్ఈ, ఈఈలు ఉండవల్లి నుండి వచ్చే నీటి సరఫరా, ఫిల్టరేషన్, ఆలం, క్లోరినేషన్ లను నేరుగా పరిశీలన చేయాలని, ఎక్కడా కలుషిత నీటి సరఫరా జరగడానికి వీలు లేదన్నారు. బిఆర్ స్టేడియం రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ లీకు పనులను పూర్తి చేసినందున, బిఆర్ స్టేడియం రిజర్వాయర్, నల్లచెరువు రిజర్వాయర్ల ఏఈలు, డిఈఈలు త్రాగునీటి సరఫరా పునరుద్ధరణ భాధ్యతతీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విలీన గ్రామాలకు త్రాగునీటిని అందించడానికి అమృత్-2 పై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్), సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్వహణ పై ఆయా విభాగ అధికారులతో సమీక్షించారు. నగరంలో 24/7 త్రాగునీటి సరఫరా అందించేందుకు రెండు జోన్లను ట్రయిల్ రన్ కోసం ఎంపిక చేయాలని ఎస్ఈని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ(ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, శ్రీనివాస్, డిఈఈ రఫిక్, ఏఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News