గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల తుది జాబితా అనంతరం అందిన మార్పు, చేర్పు, తొలగింపుల దరఖాస్తులను బూత్ లెవల్ అధికారులు(బిఎల్ఓ)లు ప్రత్యేక శ్రద్ధతో వెరిఫికేషన్ చేయాలని, బిఎల్ఓల నుండి అందిన ఫారాలను వేగంగా ప్రాసెస్ చేయడానికి వార్డ్ ఎడ్యుకేషన్ కార్యదర్శులను కేటాయించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఎన్నికల విభాగ అధికారులకు తెలిపారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఓటర్ల తుది జాబితా అనంతరం అందిన వివిధ ఫారాలు, వాటి పరిష్కారాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటరు తుది జాబితా అనంతరం అందిన నూతన ఓటు నమోదు, మార్పుల దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి తూర్పు, పశ్శిమ నియోజకవర్గాలకు 10 మంది ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రోసెసింగ్ కార్యదర్శులకు విధులు కేటాయించాలని ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగ సూపరిండెంట్ లను ఆదేశించారు. దరఖాస్తులను బిఎల్ఓలు నిశితంగా పరిశీలించాలని, ఓట్ల తొలగింపు దరఖాస్తులు వస్తే జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తప్పనిసరి అని అన్నారు. బిఎల్ఓలకు కేటాయించిన ఓటర్ల వివరాలు తుది జాబితాలో సక్రమంగా వచ్చే వరకు తమదే భాద్యత తీసుకునేలా సూపర్వైజరి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. బిఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, కేంద్రంలో మౌలిక వసతులపై సూపర్వైజరి అధికారి, ఏఈఆర్ఓలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గానికి 22 మంది సెక్ట్రోరల్ అధికారులు, 22 మంది రూట్ అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏఈఆర్ఓలు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, కె.వెంకట లక్ష్మీ, ప్రదీప్ కుమార్, ఎన్.శ్రీనివాసరావు, మేనేజర్ శివన్నారాయణ, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ, డిప్యూటీ తహసిల్దార్లు బి.భాస్కర్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News