-కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 విడతలుగా 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు
-క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఏర్పాట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఒన్ హెల్త్ ‘ ప్రోగ్రాం కింద నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యాధుల నివారణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) రాష్ట్రాలకు తెలియబరుస్తోంది. ముఖ్యంగా బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, స్క్రబ్రెఫస్, లెప్టోస్పైరాసిస్, ర్యాబిస్ వంటి కేసులు నిరోధానికి పశు సంవరక శాఖ, పుడ్సేష్టి, వైద్య ఆరోగ్య శాఖ వంటి శాఖలు ‘అవుటు బ్రేక్ లు వచ్చినప్పుడు సమష్టిగా కలిసి చర్యలు తీసుకునేందుకు అవలంబించాల్సిన విధానాలపై సదరు అధికారులకు మూడు నెలల్లో నెలకు 3 రోజుల చొప్పున తొమ్మిదిరోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడలోని ఓ హోటలులో బుధవారం నుంచి తొలివిడత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
8 జిల్లాల అధికారులకు..!
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, వెస్ట్, ప్రకాశం, ఏలూరు జిల్లాల నుంచి హాజరైన సర్వైలెన్స్ ఆఫీసర్లు, ఎపిడిమియాలజిస్టులు, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్, ఇతరులకు అవగాహన కల్పించారు ఏలూరు, విజయవాడ, గుంటూరు వైద్య కళాశాలలు, విజయవాడలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొఫెసర్లు కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో గతంలో మూకమ్మడిగా కేసుల నమోదు జరిగినప్పుడు తలెత్తిన సమస్యలు, ఇలాంటి సమయాల్లో సదరు ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న దానిపై వివరించారు. శుక్రవారం వరకు శిక్షణ కార్యక్రమాలు
జరుగుతాయి. వీరికి మళ్లీ ఫిబ్రవరి, మార్చి నెలలో మూడు రోజుల చొప్పున శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ఉంటాయి. మిగిలిన జిల్లాల అధికారులకు కొద్దికాలం తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాజస్థాన్, తెలంగాణ, గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో నిర్వహణ
సెంటర్ ఫర్ డీసిజ్ కంట్రోల్ రెసిడెంటు అడ్వయిజర్ డాక్టర్ సుకర్మ తన్వర్, నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ కంట్రోల్ ముఖ్య ప్రతినిధి డాక్టర్ ప్రియాంక, వైద్య, ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి, జాయింటు డైరెక్టర్ మలీశ్వరి, పశు సంవర్తక శాఖ జాయింటు డైరెక్టర్ చంద్రమౌళి నాయక్ వ్యాధుల నియంత్రణకు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాజస్తాన్, గుజరాత్, తెలంగాణ, జమ్ము, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను కేంద్రం నిర్వహించింది.
Prajavartha Online Telugu News