-అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు
-ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు
-’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికడుతున్నదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని తెలిపారు. శనివారం, కడప జిల్లా అవధూత కాశినాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతోపాటు వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రికు అధికారులు తెలియచేశారు. ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు.
శనివారం తెల్లవారుజామున ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందానికి అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా వరికుంట్ల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా బొలెరో మ్యాక్స్ ట్రక్కులో ఇంటి సామగ్రి ముసుగులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సన్నీ, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు. విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునుడు అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్నట్లు గుర్తించామని, వెంటనే అతడిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరు, హర్యానా, కోల్‌కతా ప్రాంతాల్లో వీరికి సహకరిస్తున్న మరికొందరు ప్రధాన సూత్రధారులను గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రధాన సూత్రధారులను పట్టుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బీట్ ఆఫీసర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.
Prajavartha Online Telugu News