Breaking News

వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్

-మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ దిశగా అడుగులు
-రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ వనరుల సాయంతో లక్షల విత్తన బంతులు వెదజల్లే పక్రియ పూర్తి
-30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధితో పూర్తి చేయాలన్న పవన్ కళ్యాణ్
-సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి
-సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమంపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపాతం, నేలలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు. జిల్లాల వారీగా సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమం, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో శనివారం మధ్యాహ్నం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియ పూర్తయ్యింది? డ్రోన్ల సాయంతో ఎంత విస్తీర్ణంలో సీడ్ బాల్స్ జారవిడిచారు? తదుపరి లక్ష్యాలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు.
ఉపముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్ దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లే ప్రక్రియ పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. అందులో మానవ వనరుల సాయంతో సుమారు 6 వేల హెక్టార్ల పరిధిలో 59 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్టు, మొట్టమొదటి సారి డ్రోన్ల సాయంతో అడవుల్లో లోయ ప్రాంతాలకి వెళ్లి సీడ్ బాల్స్ జారవిడిచినట్టు వివరించారు. సుమారు వెయ్యి ఎకరాల్లో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ జార విడిచినట్లు తెలిపారు.అత్యధికంగా రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో దాదాపు 28 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లగా, అందులో డ్రోన్ సాయంతో 2.26 లక్షలు జారవిడిచినట్టు అధికారులు చెప్పారు. విశాఖ అటవీ డివిజన్‌లో 7.50 లక్షలు, కర్నూలు అటవీ ప్రాంతంలో 8.67 లక్షల సీడ్ బాల్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఆధారంగా చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం, వైఎస్ఆర్ కడప డివిజన్లలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు, మానవ వనరులు చేరుకోవడం కష్టంగా ఉండే అటవీ ప్రాంతాలను డ్రోన్ ద్వారా చేరుకోవడం సులభం అవుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు కొంత మేర ఇబ్బందులు కలిగించవచ్చు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అవసరం అయితే డ్రోన్ల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోండి. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిన చోట కచ్చితంగా అడవి పునరుద్ధరణ మొదలవ్వాలి. మానవ వనరులతో సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకలు వస్తే, వాటిని సంరక్షించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి. 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం అత్యంత ప్రధానమైనది. ఈ కార్యక్రమ నిర్వహణలో ఎవరూ అలక్ష్యంగా ఉండవద్దు. సీడ్ బాల్స్ చల్లి సరిపుచ్చకుండా, వేడి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొక్కల పరిరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాల”న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *