-తొలి ఏకాదశి సందర్భంగా వికృతమాల శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వేద పారాయణం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా వికృతమాల గ్రామంలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో 25 మంది వేద పండితులతో ఘనంగా వేద పారాయణ కార్యక్రమం నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. వేద మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, వికృతమాలలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారికి సేవ చేసే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతోనే ఇక్కడ స్వామివారు శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా వేద పండితులతో వేద పారాయణం నిర్వహించి, వారిని ఘనంగా సత్కరించడం తమకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో పవిత్ర కోనేటి నిర్మాణంతో పాటు ఆలయ సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని, వికృతమాలను తిరుమల తరహాలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా, “చిన్న తిరుమల”గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డా. పసుపులేటి హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News