Breaking News

​ఆగస్టు 1న భారత గౌరవ ప్రధాని చేతుల మీదుగా “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” ప్రారంభోత్సవం

-“ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” పేరుతో ఆరు జిల్లాల్లో జులై 25 నుండి ఆగస్టు 1 వరకు వారం రోజుల పాటు వేడుకలు….
-విమానాశ్రయ ప్రారంభోత్సవ శుభ సమయాన్ని పంచుకునెలా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాలలో “కౌంట్‌డౌన్ డిజిటల్ స్క్రీన్లు” ఏర్పాట్లు.
-సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె ఎస్ విశ్వనాథన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర ప్రజాకాంక్షలు, సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 01వ తేదీన భారత గౌరవ ప్రధానమంత్రి ఘనంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి, పర్యాటక మరియు పారిశ్రామిక రంగాలు పుంజుకోవడమే లక్ష్యంగా “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” (Uttarandhra Kalalaku Rekkalu) అనే ప్రత్యేక థీమ్‌తో నేటి నుండి ఆగస్టు 01 వరకు వారం రోజుల పాటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాల్లో సమాచార పౌర సంబంధాల శాఖ మరియు జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ తెలిపారు.
​ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాలలో “కౌంట్‌డౌన్ డిజిటల్ స్క్రీన్లు” ఏర్పాటు చేసి విమానాశ్రయ ప్రారంభోత్సవ శుభ సమయాన్ని పంచుకునెలా ఏర్పాటు చేశా మన్నారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు “మై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్” థీమ్‌తో క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలకు ఆగస్టు 1న జరిగే ప్రధాని ప్రారంభోత్సవ సభలో విశిష్ట ఆసనాలు (VIP Seating) కేటాయించడం జరుగుతుందని, అలాగే, విమానాశ్రయం విజయవంతంగా ప్రారంభమై ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడాలని కాంక్షిస్తూ ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు.
​ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విమానాశ్రయం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తూ, గిరిజన సహకార సంస్థ (GCC) ఆధ్వర్యంలో అరకు కాఫీ, అరకు పసుపు వంటి స్థానిక ఉత్పత్తుల బ్రాండింగ్, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు 1న గౌరవ ప్రధానమంత్రి ఉత్తరాంధ్ర గిరిజన ప్రత్యేక ఉత్పత్తులను బహుకరిస్తారన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, విమానాశ్రయం ద్వారా పెరగనున్న పర్యాటక అవకాశాలు మరియు హోమ్‌స్టేల నమోదుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జులై 30న సెర్ప్ (SERP) మరియు మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో “భోగాపురం – ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” అంశంపై మహిళలతో బృహత్ రంగోలీ (ముగ్గుల) పోటీలు జరుగుతాయన్నారు.
​క్రీడలు మరియు సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహిస్తూ “భోగాపురం థీమ్”తో క్రికెట్, బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగి గ్రామంలో మరియు ప్రధాన కేంద్రాల్లో జానపద రూపకాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా విప్లవ వీరునికి నివాళులు అర్పిస్తారన్నారు. జులై 31న విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్‌లో 5K/10K మారథాన్ రన్, సైక్లథాన్, ఫ్లాష్ మాబ్‌లు నిర్వహించడంతో పాటు, రాత్రి వేళ ఉత్తరాంధ్ర వైభవాన్ని, విమానాశ్రయ రూపురేఖలను చాటేలా కంటిపాపగా నిలిచే భారీ “డ్రోన్ షో” నిర్వహించనున్నామన్నారు.
​ఈ ప్రచార ప్రణాళికలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. దీనిలో భాగంగా జులై 25న విజయనగరంలో ప్రచార ప్రారంభం మరియు ప్లెడ్జ్ వాల్ ఆవిష్కరణ,
జులై 26న శ్రీకాకుళంలో జెఎస్డబ్ల్యు / పైడి భీమవరం వద్ద 45,000 ఉద్యోగాల కల్పనపై పారిశ్రామిక సదస్సు మరియు అరసవల్లి ఆలయ ప్రచారం, జులై 28న పార్వతీపురం మన్యంలో అరకు పసుపు కియోస్క్ మరియు ఎంఎస్ఎంఇ పార్కుల ఎక్స్‌పో, జులై 29న అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ రైతుల సదస్సు, జులై 30న అనకాపల్లిలో ఎన్నారై మరియు పారిశ్రామికవేత్తల కలయిక, జులై 31న విశాఖపట్నంలో ఐటీ కెరీర్ ఎక్స్‌పో మరియు గ్రాండ్ డ్రోన్ షో నిర్వహిస్తారన్నారు.
​ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా జులై 31న ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారన్నారు. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుచున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త బాటలు వేస్తున్న ఈ సువర్ణ ఘట్టంలో ప్రజలందరూ విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె. ఎస్. విశ్వనాథన్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *