-రైతుల సంక్షేమానికి హై ప్రయార్టీ… సమస్య పరిష్కారానికి బయ్యర్లూ సహకరించాలి
-సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ, డైరెక్టర్ల భేటీ
-నిరంతర సంప్రదింపులతో వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులను రాష్ట్రానికి పంపిన కేంద్రం
-పొగాకు రైతులను ఆదుకునేలా 3 ప్రతిపాదనలు సిద్దం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చేపడుతున్న నిరంతర సంప్రదింపులతో రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆ శాఖ అదనపు సెక్రుటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ ను రాష్ట్రానికి పంపింది. కర్నూలు జిల్లా పర్యటనకు బయలు దేరే ముందు సీఎం చంద్రబాబుతో వీరు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులు, టుబాకో బోర్డు ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకునేలా సిద్దం చేసిన 3 ప్రతిపాదనలపై సీఎంతో కేంద్ర ప్రతినిధులు చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో చర్చించాలని… ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సయయంలో ప్రతేడాది పొగాకు రంగంలో ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూహాలతో సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. కేంద్రం వైవు నుంచి ఏ మేరకు సాయం అందించగలరు… రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యల పైనా చర్చించి తుది నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు, బయ్యర్లు, టొబాకో బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా అందరూ స్టేక్‌హోల్డర్లేనని, అందరి బాధ్యతతోనే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పంటను ఒకటి, రెండేళ్లు నిల్వ ఉంచే అవకాశాలున్నాయా..? ధరలు స్థిరపడిన తర్వాత విక్రయించుకోవచ్చా.. అనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లో, మీడియం, హై గ్రేడ్ పొగాకును మార్కెట్‌లో ఎలా విక్రయించాలనే దాని పైనా ట్రేడర్లతో మాట్లాడి ఓ కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. పొగాకు రంగంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ అవసరమన్నారు. సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో రైతుల ప్రయోజనాలకు హై ప్రయార్టీ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్రేడర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కటి విధానాన్ని రూపొందించవచ్చని సీఎం సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లీడ్ తీసుకుని చర్చలను కొనసాగించాలని సూచించిన ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రులు గొట్టిపాటి, డీబీవీ స్వామి, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా నరసరావుపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ట్రేడర్లతో కేంద్రం సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సమావేశానికి వర్చువల్ గా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు.
ట్రేడర్లతో కేంద్ర మంత్రి పెమ్మసాని చర్చలు
సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరిన అనంతరం పలువురు ముఖ్యమైన పొగాకు బయ్యర్లతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వర్చువల్ గా సమావేశమయ్యారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే టుబాకో బోర్డు ముందుకు వచ్చాయని.. రైతులకు మేలు చేసేలా బయ్యర్లు కూడా ఓ అడుగు ముందుకు వేయాలని పెమ్మసాని సూచించారు. రైతులు నష్టపోకుండా ట్రేడర్ల వైపు నుంచి ఏమేం చేయగలరోననే అంశాన్ని చర్చించుకుని మంచి ప్రతిపాదనలతో రావాలని కోరారు. సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
Prajavartha Online Telugu News