-ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఆగస్టు 17 నుంచి 29 వరకు నిర్వహణ
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలను సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
జిల్లాలో ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు ఎంపిక చేయబడిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ శిబిరాలు 11.08.2026 నుంచి 14.08.2026 వరకు, 17.08.2026 నుంచి 29.08.2026 వరకు నిర్వహించబడతాయన్నారు. ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆధార్ శిబిరాలను సద్వినియోగం చేసుకొని, ఆధార్‌కు సంబంధించిన అవసరమైన సేవలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రత్యేక శిబిరాలలో కొత్త ఆధార్ నమోదు, ఆధార్‌లో పేరును సరిచేయడం/ నవీకరించడం, చిరునామా మార్పు, జనన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాల నవీకరణ చేయడం జరుగుతుందన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. 15 సంవత్సరాలు, అంతకంటే పైబడిన వారికి అవసరమైన బయోమెట్రిక్ నవీకరణ, ఇతర ఆధార్ సంబంధిత సవరణలు, నవీకరణ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థుల ఆధార్ సంబంధిత సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన నవీకరణలు ఉంటే ఈ ప్రత్యేక శిబిరాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆధార్ సేవలను ప్రజలకు సకాలంలో, పారదర్శకంగా, సులభంగా అందించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శిబిరాల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది సమన్వయం, సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆధార్ నమోదు లేదా ఆధార్ వివరాల నవీకరణ అవసరమున్న ప్రతి పౌరుడు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కోరారు. ఆధార్ వివరాలను సక్రమంగా, తాజా సమాచారంతో ఉంచుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఇతర అవసరమైన సేవలను పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News