గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు వార్డుల వారీగా కేటాయించిన ఈ-ఆటోలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి ఈ-ఆటో తప్పనిసరిగా రోజుకు 1000 ఇళ్ల నుండి చెత్తను సేకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం శ్యామలా నగర్, రాజేంద్ర నగర్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను కమిషనర్ నేరుగా పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ-ఆటోలు తప్పనిసరిగా ఉదయం 6 గంటలకల్లా వార్డ్ లలో ఉండాలని, ప్రతి ఆటోకి షెడ్యూల్ రూట్ మ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. ఆటోలో నిర్దేశిత వెయ్యి కిలోల సామర్ధ్యంతో చెత్తను లోడ్ చేయాలన్నారు. వార్డ్ ల్లో కేటాయించిన ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. నగర పరిధిలోని ఖాళీ స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ పడి ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. చెత్త తరలింపుకు కేటాయించిన ట్రాక్టర్ లు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు క్షేత్ర స్థాయిలోనే ఉండాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో పారదర్శకత కోసం కార్మికులకు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారానే హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా చెత్తను పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ‘స్వచ్ఛ యాప్’ ద్వారా అపరాధ రుసుం విధించాలని స్పష్టం చేశారు. కళ్యాణ మండపాలు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ వద్ద ఉత్పత్తయ్యే వ్యర్థాలను జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌కు వారే స్వయంగా తరలించాలని, లేదా వారి ఆవరణలోనే కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని చెత్తను ప్రాసెస్ చేసుకోవాలని, ఈ మేరకు వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నడింపాలెంలో ఆయూష్ వైద్యశాల నిర్మాణంకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, మెరక చేయడానికి నగరంలోని భవన నిర్మాణ వ్యర్ధాలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఈఈ విష్ణు, డిఈఈ వెంకటరమణ, ఎస్ఎస్ సోమశేఖర్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News