-పారదర్శకత, గడువులోగా సేవలే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు –కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర సేవల్లో పారదర్శకత పెంచేందుకు మరియు వేగవంతమైన సేవలు అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు అందించే ఆస్తిపన్ను విధింపు, ఖాళీ స్థలాల పన్ను, పేరు మార్పు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, సబ్‌డివిజన్, అమాల్గమేషన్, పన్ను మినహాయింపులు వంటి అన్ని రకాల రెవెన్యూ సేవలన్నిటికీ ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి మాన్యువల్ ప్రక్రియకూ ఆస్కారం లేదని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రెవెన్యూ సేవలకు సంబంధించి జరుగుతున్న జాప్యాన్నినివారించేందుకు, అన్ని అర్జీలను కేవలం ఈఆర్పీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే నమోదు చేయాలని ఆదేశించారు. వార్డు అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు ఇకపై ఎలాంటి మాన్యువల్ లేదా పేపర్ ఫైళ్లను, నెలవారీ రిజిస్టర్లను స్వీకరించకూడదని స్పష్టం చేశారు. ప్రతి సేవకూ స్పష్టమైన పరిష్కార గడువును నిర్ణయించడం జరిగిందన్నారు. నూతన ఆస్తిపన్ను లేదా ఖాళీ స్థలం పన్ను నమోదు, చేర్పులు-మార్పులు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, పన్ను మినహాయింపులు, ఖాళీ స్థలం పన్నును ఇంటి పన్నుగా మార్చడం, సబ్‌డివిజన్, అమాల్గమేషన్ మరియు ఖాళీ భవన రిమిషన్ వంటి సేవలను గరిష్టంగా 15 రోజుల్లోగా, అలాగే రివిజన్ పిటిషన్లను 31 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కావున అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నిర్ణీత సమయంలో సేవలు అందజేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News