-ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయం
-వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు
-60 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి
-డిజిటల్ పర్యవేక్షణకు ‘సురక్ష’ డ్యాష్‌బోర్డ్ ఆవిష్కరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, 2026 డిసెంబరు 1 నాటికి నిర్దేశిత ‘95-95-99’ లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ సాధనలో యువతతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్) ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ’60 రోజుల ప్రత్యేక సమాచార, విద్య, ప్రచారం పేరుతో తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గతంతో పోలిస్తే కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు 77 శాతం, మరణాలు 87 శాతం తగ్గడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ క్రమంలో అంచనా వేసిన హెచ్ఐవి బాధితుల్లో 95 శాతం మందికి హెచ్ ఐవి వచ్చినట్లు తెలిసి ఉండాలని, తెలిసిన వారిలో 95 శాతం మంది మందులు వాడుతూ ఉండాలని, మందులు వాడే వారిలో 99 శాతం మందికి వైరల్ లోడ్ బాగా తగ్గి ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. ఈ మూడు కేటగిరీల్లో రాష్ట్ర ప్రభుత్వం 88-87-96.2 శాతం మేర పురోగతిని సాధించిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని(95-95-99) డిసెంబరు 1 గడువులోగా లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
డిసెంబరు లక్ష్యంపై కేంద్రీకృత కార్యాచరణ
ఈ మూడు దశల్లో ఎక్కడ లోటు ఉందో గుర్తించి.. అక్కడే ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల సాధనలో యువతను ప్రధాన భాగస్వామ్యం చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
‘సురక్ష’తో జిల్లాల వారీగా పర్యవేక్షణ
హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల పురోగతిని, జిల్లాల వారీగా ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తయారు చేసిన *‘సురక్ష డ్యాష్‌బోర్డ్’*ను మంత్రి ఆవిష్కరించారు. దీని ద్వారా ఏ జిల్లాలో పురోగతి ఎలా ఉంది? ఎక్కడ లోటు ఉంది? ఎక్కడ ప్రత్యేక దృష్టి అవసరం? ఏ ప్రాంతాల్లో చర్యలను వేగవంతం చేయాలి? వంటి అంశాలను గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంటుంది.
యువతతో 60 రోజుల ప్రత్యేక ప్రచారం
రాబోయే 60 రోజుల పాటు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ తెలిపారు. ఎయిడ్స్ రహిత దేశం కోసం సన్నద్దీకరణలో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం డిసెంబరు నాటికి ‘సురక్షిత్ , సురక్షిత్ ప్లస్‘ లక్ష్యాలను సాధించే దిశగా కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. జానపద కళాజాతాలు, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలని తెలిపారు.
తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ నివారణ
గర్భిణీలకు ముందస్తుగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించడం ద్వారా తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సంక్రమించకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు తెలిపారు. అవసరమైన వారికి సకాలంలో చికిత్స అందేలా సేవలను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏఆర్‌టీ కేంద్రాల పనితీరుపై సమీక్ష
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏఆర్‌టీ కేంద్రాల పనితీరును సమీక్షించడంతో పాటు.. చికిత్స పొందుతున్న వారి కొనసాగింపును పర్యవేక్షిస్తున్నామని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ స్మరణ్ రాజ్ తెలిపారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందేలా, చికిత్సలో ఉన్నవారికి నిరంతర సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాబోయే 60 రోజుల్లో చేపట్టే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, వల్నరబుల్ వర్గాల వరకు విస్తరించనున్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది, విద్యాసంస్థలు, ప్రసార మాధ్యమాల భాగస్వామ్యంతో ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామన్నారు. గర్భిణీల పరీక్షలు, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ నివారణ, ఏఆర్‌టీ చికిత్స కొనసాగింపు, వైరల్ లోడ్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ప్రతి జిల్లాలోని గ్యాప్‌ను గుర్తించి.. దానికి తగిన చర్యలు తీసుకుంటాం. గుర్తింపు నుంచి చికిత్స వరకు, చికిత్స నుంచి వైరల్ లోడ్ నియంత్రణ వరకు ప్రతి దశను పర్యవేక్షిస్తాం. ఇప్పటికే సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా అడుగులు వేస్తాం” అని ప్రాజెక్ట్ డైరెక్టర్, స్మరణ్ రాజ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ శాక్స్ ఇన్ ఛార్జి అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, జేడీ ఐ ఈ సి డాక్టర్ మంజుల, జేడీ టి ఐ సుకుమార్, జేడీ బి. ఎస్. డి, సి.ఎస్.టి డాక్టర్. శ్రీనివాస వర్మ, జేడీ బి.టి.ఎస్ డాక్టర్ చక్రవర్తి ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములైన రాష్ట్రంలోని ముఖ్యమైన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు , యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News