Breaking News

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రయాణికుల సౌకర్యాలపై పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం, రైల్వే భూముల సద్వినియోగం, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,340 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే 261 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కియోస్క్‌లు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొంది.

సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రాబోయే ఐదేళ్లలో 17 వేల కొత్త నాన్-ఏసీ జనరల్, స్లీపర్ కోచ్‌లను తయారు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రైల్వేలో ఉన్న మొత్తం సీట్లలో 78 శాతం, అంటే సుమారు 54 లక్షల సీట్లు నాన్-ఏసీ కోచ్‌లలో ఉన్నాయని వెల్లడించింది. పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 2025-26లో సుమారు 80 వేల ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపింది.

సామాన్య ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో తక్కువ ఖర్చుతో ప్రయాణం అందించేందుకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు కేంద్రం పేర్కొంది. ఈ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ కెమెరాలు, మెరుగైన సీటింగ్, భద్రతా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36 జతల అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని వెల్లడించింది.

అదేవిధంగా, వినియోగంలో లేని రైల్వే భూములను రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి రైల్వేకు అదనపు ఆదాయం సమకూర్చే చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. రైల్వే భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు నిరంతరం సర్వేలు, పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. గత మూడేళ్లలో సుమారు 63.79 హెక్టార్ల రైల్వే భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
సామాన్య ప్రజలకు మెరుగైన రైలు ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు రైల్వే మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఎంపీ గురుమూర్తి తన ప్రశ్న ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *