అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో విశిష్ట, ప్రశంసనీయమైన సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (APPA) అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ ర్యాంక్) సయ్యద్ మహబూబ్ బాషాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (IPM) కు ఎంపిక చేసింది. విధి నిర్వహణ పట్ల అసాధారణమైన అంకితభావం, నిబద్ధత, నిష్కళంకమైన నిజాయితీ ఇంకా ఆదర్శప్రాయమైన వృత్తి నైపుణ్యాన్ని కనపరించినందుకు అత్యున్నతమైన జాతీయ ‘ఇండియన్ పోలీస్ మెడల్’ పురస్కారంతో సత్కరించనున్నారు.
సయ్యద్ మహబూబ్ బాషా 1998లో పోలీసు శాఖలో చేరి, ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ , సంస్థాగత శ్రేష్ఠతకు అంకితమై విశేష సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ కమాండెంట్ / డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, పోలీసు అధికారుల శిక్షణ, పరిపాలనా వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తన 28 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో కనబరిచిన అచంచలమైన క్రమశిక్షణ, సమర్థవంతమైన నాయకత్వం , కర్తవ్య నిష్టకు ఈ జాతీయ పురస్కారం నిదర్శనంగా నిలిచింది.
“గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందనున్న ‘ఇండియన్ పోలీస్ మెడల్’ పురస్కారం, పోలీసు విభాగంలో సయ్యద్ మహబూబ్ బాషా దీర్ఘకాలిక అంకితభావం, ఆదర్శప్రాయమైన నాయకత్వం , ఉన్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలకు దక్కిన సముచిత గౌరవం.”
ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఏపీ పోలీస్ అకాడమీ సీనియర్ అధికారులు, తోటి సహోద్యోగులు, సిబ్బంది , పోలీస్ ఉన్నతాధికారులు, మిత్రులు సయ్యద్ మహబూబ్ బాషా కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో దేశ సేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News